అనంతపురం, జూన్ 09 :
– అనంతపురం నగరంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏపీ టూరిజం శాఖ మరియు సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా పర్యాటక అభివృద్ధిపై అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు.
– ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి సూచనలతో అనంతపురం జిల్లాను రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా గుత్తి కోట మరియు అనంతపురం శిల్పారామం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. గుత్తి కోటను చారిత్రక వైభవంతో పాటు సాహస పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ఇందులో గుర్రపు స్వారీ, గో-కార్టింగ్ ట్రాక్, జిప్ లైన్, ట్రెక్కింగ్, హైకింగ్, టెంట్ స్టేలు, ఏటీవీ రైడ్స్, బర్మా బ్రిడ్జ్, ర్యాపెల్లింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్‌తో పాటు బాలల ఉద్యానవనం, ఆకర్షణీయమైన ప్రవేశ తోరణం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రవేశ తోరణంను ఎంపీ నిధుల కింద ఏర్పాటు చేస్తామన్నారు.
– అనంతపురం శిల్పారామాన్ని కుటుంబాలందరికీ ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు స్కేటింగ్ సదుపాయం, ఈత కొలను, లేజీ రివర్ వాటర్ రైడ్, నక్షత్ర వనం వంటి ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేయాలన్నారు. గుత్తి కోట అభివృద్ధిలో భాగంగా రహదారుల నిర్మాణానికి వీబిజి రాంజీ పథకం కింద రూ.1 కోటి, కోట మెట్ల అభివృద్ధికి ఏపీ టూరిజం ద్వారా రూ.1.50 కోట్లు ప్రభుత్వం కేటాయించనున్నట్లు అధికారులతో సమీక్షించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ నిధులను సమన్వయం చేస్తూ జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడమే మా లక్ష్యం అన్నారు. అనంతపురం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, జిల్లా చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రతి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లాను ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తూ, అభివృద్ధి, ఉపాధి, పర్యాటక ప్రగతిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతామన్నారు.
– ఈ సమావేశంలో జిల్లా టూరిజం అధికారి ఓబులమ్మ, టూరిజం శాఖ అధికారులు దీపక్, సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ రాజేష్, కన్జర్వేషన్ అసిస్టెంట్ అచ్యుత్ నరహరి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
