అనంతపురం జిల్లా రాయదుర్గం
బిఐఓపి పరిశ్రమ వద్ద ఓబులాపురం రైతుల ఆందోళన
అనంతపురం జిల్లా డి. హీరేహాళ్ మండలం ఓబులాపురం గ్రామ సమీపంలోని బిఐఓపి పరిశ్రమ వద్ద భూములు కోల్పోయిన రైతులు చేపట్టిన ఆందోళన . తమ భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉదయం నుంచి ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం ఎదుట టెంట్ ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో బిఐఓపి పరిశ్రమ జనరల్ మేనేజర్ రామచంద్ర నిరసన స్థలానికి చేరుకుని రైతులు, సీపీఐ నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం విషయం తెలుసుకున్న డి. హీరేహాళ్ సబ్ ఇన్‌స్పెక్టర్ గురు ప్రసాద్ రెడ్డి, అధికారులు కూడా అక్కడికి చేరుకుని రైతులు, పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడారు.
చర్చల సందర్భంగా వచ్చే శుక్రవారం పరిశ్రమ యాజమాన్యం, రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని అధికారులు, యాజమాన్య ప్రతినిధులు హామీ ఇచ్చారు. అప్పటి వరకు ఆందోళన విరమించాలని కోరడంతో రైతులు తమ నిరసనను తాత్కాలికంగా నిలిపివేశారు.
దీనికి స్పందించిన రైతులు, సీపీఐ నాయకులు మాట్లాడుతూ, పరిశ్రమ ప్రతినిధులు స్వయంగా వచ్చి హామీ ఇచ్చినందున శుక్రవారం వరకు గడువు ఇస్తున్నామని తెలిపారు. ఆ సమావేశానికి రెవెన్యూ అధికారులు, పరిశ్రమ యాజమాన్యం తప్పనిసరిగా హాజరై భూములకు సంబంధించిన పూర్తి పత్రాలను రైతులకు చూపించాలని డిమాండ్ చేశారు.
అలాగే భూములపై సమగ్ర సర్వే నిర్వహించి, తమకు చెందిన భూములను తిరిగి అప్పగించాలని కోరారు. ఒకవేళ సమస్యకు సరైన పరిష్కారం లభించకపోతే బిఐఓపి పరిశ్రమను బంద్ చేసి మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని రైతులు, సీపీఐ నాయకులు హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ నాయకుడు నాగార్జున, రైతు సంఘం అధ్యక్షుడు తిప్పేస్వామి, సిద్ధమ్మ, ఆదిబసప్ప, ఆదిమూర్తి, బసప్ప, తలారి వెంకటేశులు, శివకుమార్, కే. తిప్పేస్వామి, డీజే బసవరాజ్‌తో పాటు ఓబులాపురం గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
