అనంతపురం జిల్లా రాయదుర్గం
కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలైన పాలన: గ్రామదట్ల సభలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం, జూన్ 8: రైతుల భూములపై సంపూర్ణ హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం రూరల్ మండలంలోని గ్రామదట్ల గ్రామంలో సోమవారం మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల్లో అనేక అనుమానాలు, గందరగోళానికి కారణమైందని విమర్శించారు. రైతుల భూములపై వారి హక్కులకు భంగం కలిగేలా ఆ చట్టం ఉందని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం రైతుల పాస్ పుస్తకాలతో పాటు పొలాల సరిహద్దు రాళ్లపై కూడా ముఖ్యమంత్రి జగన్ చిత్రాలను ఏర్పాటు చేయడం వల్ల యాజమాన్య హక్కులపై సందిగ్ధత నెలకొందని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి, రైతుల భూములపై పూర్తి హక్కులను పునరుద్ధరించారని తెలిపారు. ప్రస్తుతం రైతుల ఫోటోలతో పాటు అధికారిక రాజముద్రలు కలిగిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు.
భూమిపై రైతుకు సంపూర్ణ హక్కులు కల్పించిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు నిలిచారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు మేలైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజాసేవకు ప్రతిఫలంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఓటు మాత్రమే కోరుకుంటున్నామని అన్నారు. ప్రజల ఆదరణ, ఆశీర్వాదాలు, సహకారం ఉంటే అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కురుబ హనుమంతు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ హనుమంత రెడ్డి, కాటా వెంకటేశులు, మాజీ సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి, బీమాసేన రావు, క్లస్టర్ ఇన్‌చార్జి వాల్మీకి సిద్ధప్ప, నాగిరెడ్డిపల్లి హనుమంతు, సోము, వన్నూరు స్వామి తదితరులు పాల్గొన్నారు.
