అనంతపురం జిల్లా, రాయదుర్గం.
హుళికల్ ట్యాంక్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి: కలెక్టర్ ఓ. ఆనంద్
అనంతపురం, జూన్ 5: డి.హీరేహాల్ మండలం హుళికల్ గ్రామం వద్ద ఆర్ఆర్ఆర్ (రిపేర్స్, రెనోవేషన్ అండ్ రెస్టోరేషన్) పథకం కింద చేపట్టిన ట్యాంక్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్యాంక్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని సూచించారు.
అలాగే జలధార కార్యక్రమం కింద లింక్ ఫీడర్ చానళ్ల నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. నీటి వనరుల అభివృద్ధి, సాగునీటి సదుపాయాల మెరుగుదలకు అధికారులు, రైతులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ పరిశీలనలో మైనర్ ఇరిగేషన్ డీఈ గీతాలక్ష్మి, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి, డి.హీరేహాళ్ తహసీల్దార్, ఎంపీడీఓ, మైనర్ ఇరిగేషన్ జేఈలు, ఎండబ్ల్యుఆర్ఓ తదితర అధికారులు పాల్గొన్నారు.
