అనంతపురం జిల్లా, రాయదుర్గం.
“గ్రీన్ సోల్జర్స్‌గా ఎదుగుతాం”
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
రాయదుర్గం, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాయదుర్గంలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలు మరియు అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాయదుర్గం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ఆవరణలో విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు టేకు, బాదామి, అంజూరు, పూల మొక్కలను నాటగా, ఎన్‌సీసీ క్యాడెట్లు కళాశాల అంతర్గత ఉద్యానవనాన్ని పరిశుభ్రం చేసి మొక్కలకు పాదులు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. బీట్ ఆఫీసర్ బి. ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న పర్యావరణ చైతన్యం అభినందనీయమని, అందరూ “గ్రీన్ సోల్జర్స్”గా ఎదిగి చెట్ల సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వృక్షశాస్త్ర అధ్యాపకులు ఎ.ఎస్. విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతిలో చెట్ల ప్రాధాన్యతను వివరించారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు జి. కోదండరాములు, డి. నారాయణ, అధ్యాపకులు ఎం. లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
అనంతరం కళాశాల నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేసి “పర్యావరణ పరిరక్షణ – మనకు రక్ష”, “పర్యావరణాన్ని కాపాడుదాం – కాలుష్యాన్ని నివారిద్దాం” అంటూ నినాదాలు చేశారు.
కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. దామోదర్ రెడ్డి, బీట్ ఆఫీసర్ బి. ఆంజనేయులు, అధ్యాపకులు ఎ.ఎస్. విజయ్ కుమార్, జి. కోదండరాములు, డి. నారాయణ, ఎం. లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, గోవర్ధన్, ప్రశాంత్, బోధనేతర సిబ్బంది చందన్, అస్లాం, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, వాలంటీర్లను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. సహదేవుడు అభినందించారు.
