విద్యార్థి కలలకు భరోసా: ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ గారి ఆర్థిక సాయం
*పేదరికం అడ్డుగోడగా మారినా.. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ గారి సహకారం తో కొనసాగనున్న విద్యాభ్యాసం*
==================================
శెట్టూరు, జూన్ 4: ఉన్నత చదువులతో కుటుంబ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకునే ఓ పేద విద్యార్థికి ‘ ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ గారు ‘ అండగా నిలిచారు. ఫీజు చెల్లించలేక చదువు ఆపేయాల్సిన పరిస్థితిలో ఉన్న ఆ విద్యార్థికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులతో కలిసి ఆర్థిక చేయూతను అందించి, విద్యాదానంలో తమ ఉదారతను చాటుకుంది.
వివరాల్లోకెళ్తే ….
శెట్టూరు మండలం, చింతర్లపల్లి గ్రామానికి చెందిన చిన్న లింగప్ప, లక్ష్మిదేవి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు సి.రాజు అనంతపురం పట్టణంలోని ఆర్.ఆర్. కళాశాలలో బి.ఎస్సీ (MLT) కోర్సును అభ్యసిస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, కళాశాల ఫీజు చెల్లించలేక గత కొంతకాలంగా రాజు విద్యాభ్యాసం అర్థాంతరంగా ఆగిపోయి ఇంటి వద్దే ఉండిపోయాడు.
ఈ విషయాన్ని గమనించిన ఆ కుటుంబ సభ్యులు ‘ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్’ను ఆశ్రయించారు. విద్యార్థి పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించిన ట్రస్ట్ ప్రతినిధులు, వెంటనే స్పందించి కళాశాల పేరు మీద రూ. 25,000/- చెక్కును అందజేశారు. ఈ ఆర్థిక సాయంతో రాజు తిరిగి తన చదువును కొనసాగించే అవకాశం లభించింది.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ సురేష్ కుమార్, గౌరవ అధ్యక్షులు అబ్దుల్ వాహబ్, గౌరవ సలహాదారులు జి. అశోక్ కుమార్, కోశాధికారి సి. తిప్పేస్వామి మరియు సభ్యులు ఆది ఆంధ్ర తిప్పేస్వామి, మహేష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థుల చదువు కోసం ట్రస్ట్ చేస్తున్న ఈ కృషిని స్థానికులు అభినందిస్తున్నారు.
