తాడిమర్రి (yes9tv) చిలకొండయ్యపల్లి – బంగారంపేట మధ్య లభ్యమైన మృతదేహం గుర్తింపు
వెస్ట్ బెంగాల్‌కు చెందిన కూలీగా నిర్ధారణ.. పోస్టుమార్టం కోసం ధర్మవరం ఆసుపత్రికి తరలింపు
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలోని చిలకొండయ్యపల్లి – బంగారంపేట గ్రామాల మధ్య ఉన్న వ్యవసాయ తోటలో అనుమానాస్పద స్థితిలో లభ్యమైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఎట్టకేలకు గుర్తించబడింది.
పోలీసుల వివరాల మేరకు, దాడితోట గ్రామ సమీపంలోని పార్నపల్లి రిజర్వాయర్ వద్ద జరుగుతున్న ఆదాని హైడ్రో పవర్ ప్రాజెక్టులో కూలీగా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అలీపుర్‌దువార్ జిల్లా గంగోటియా గ్రామానికి చెందిన పత్రాస్ ముండా (45), తండ్రి తీస్రా ముండా, ఈ నెల 28వ తేదీన పనుల నిమిత్తం అక్కడికి వచ్చాడు.
అదే రోజు ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో మద్యం సేవించిన పత్రాస్ ముండా తన అల్లుడు బిశాల్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అనంతరం ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
ఇదిలా ఉండగా, చిలకొండయ్యపల్లి – బంగారంపేట గ్రామాల మధ్య ఉన్న తోటలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైందని సమాచారం అందడంతో బిశాల్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించాడు. మృతుడు తన మామ పత్రాస్ ముండానేనని గుర్తించాడు.
మరోవైపు, పత్రాస్ ముండా కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు తాడిమర్రి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై కృష్ణవేణి యాదవ్‌ను ఆశ్రయించారు. ఇప్పటికే లభ్యమైన మృతదేహాన్ని వారికి చూపించగా, అది పత్రాస్ ముండాదేనని కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
దీంతో ఎస్సై కృష్ణవేణి యాదవ్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మరణానికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉందని ఎస్సై కృష్ణవేణి యాదవ్ తెలిపారు. కేసుపై తాడిమర్రి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాడిమర్రి పొలంలో దొరికిన మృతదేహం మిస్టరీ వీడింది: పశ్చిమ బెంగాల్ కూలీగా గుర్తింపు..
