వర్షం కోసం గాడిదలకు పెళ్లిళ్లు చేసిన కుర్లపల్లి గ్రామస్తులు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతిలో గాడిదలకు వివాహం జరిపించారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని హిందూ సంప్రదాయాల ప్రకారం మంగళసూత్రం కట్టి, తలంబ్రాలు పోసి, ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామంలో నెలకొన్న వర్షాభావం తొలగి, చెరువులు నిండి, రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఈ విశేష కార్యక్రమం చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటువంటి ఆచారాలు పూర్వకాలం నుంచి కొనసాగుతున్నాయని, ప్రకృతి అనుగ్రహం కోసం విశ్వాసంతో ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని గ్రామ ప్రజలు ప్రార్థించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
