ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ సేవలు – ఎంపీపీ ఆదినారాయణ యాదవ్
ముదిగుబ్బ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఐవీఆర్‌ఎస్, పీపీపీ విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొని పెన్షన్ పంపిణీ, ప్రజా సేవల అమలు, ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా అందించడమే అధికారుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఓర్పుతో విని, ప్రేమగా, ఆప్యాయంగా పలకరిస్తూ సేవలు అందించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చిన్న చిన్న సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరగకుండా సకాలంలో పరిష్కారాలు చూపించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంశాల్లో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే స్పందించాలని పేర్కొన్నారు.
ముదిగుబ్బ మండలంలో ఎలాంటి పరిపాలనా సమస్యలు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ప్రభుత్వ పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని సూచించారు. ఎక్కడైనా పెన్షన్లు, రేషన్, విద్యుత్, తాగునీరు లేదా ఇతర సేవలకు సంబంధించిన సమస్యలు ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరించి ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెంచాలని అన్నారు.
ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ జనార్దన్ రావు, ఎంపీడీవో హాజీవలి, డిప్యూటీ ఎంపీడీవో మంజుల, మండల విద్యుత్ శాఖ ఏఈ చంద్రనాయక్,ప్రభుత్వ పథకాల అమలుపై వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా సోలార్ ప్యానెల్లు అందించే కార్యక్రమాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
బ్రతుక విలేజ్‌లలో కూడా ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద సోలార్ ప్యానెల్లను విరివిగా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.
