శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం.
పంచ్ ప్రభాకర్ పై పోలీసులకు ఆర్యవైశ్య సంఘం ఫిర్యాదు
హిందూపురం, మే 28:
సోషల్ మీడియా వేదికల ద్వారా ఆర్యవైశ్య సమాజంపై అసత్య ప్రచారం, పరువు నష్టం, విద్వేషపూరిత వ్యాఖ్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హిందూపురం ఆర్యవైశ్య సంఘం నాయకులు పోలీసులను ఆశ్రయించారు. హిందూపురం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జేపీకే రాము ఆధ్వర్యంలో డీఎస్పీ మరియు టూ టౌన్ సీఐలకు ఫిర్యాదు పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జేపీకే రాము మాట్లాడుతూ, “చినిపల్లి ప్రభాకర్ రెడ్డి అలియాస్ పంచ్ ప్రభాకర్ సోషల్ మీడియా వేదికలైన YouTube, WhatsApp, Instagram తదితర డిజిటల్ మాధ్యమాల ద్వారా ఆర్యవైశ్య కులం, కుల పెద్దలు మరియు వైశ్య సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య, దూషణాత్మక మరియు అవమానకర ప్రచారం నిర్వహిస్తున్నాడు” అని ఆరోపించారు.
అతను అనేక సోషల్ మీడియా ఐడీలను వినియోగిస్తూ కొంతమందితో కలిసి సమన్వయంతో తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నాడని తెలిపారు. ఈ ప్రచారాల వల్ల సమాజంలో ఉద్రిక్తతలు, శాంతిభంగ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు.
ఇది ఒక ప్రణాళికాబద్ధమైన సైబర్ దుష్ప్రచారంగా కనిపిస్తోందని పేర్కొంటూ, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సంబంధిత సోషల్ మీడియా అకౌంట్లు, వీడియోలు మరియు డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.
