Latest Posts

కాటాలోనే మోసం.. చీని రైతులకు లక్షల్లో టోకరా: వ్యాపారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన బాధితులు!

అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం.

టన్నుల్లో తూకాల మోసం.. చీని రైతులకు లక్షల్లో టోకరా..

చీని రైతులతో పాటు మొక్కజొన్న, వేరుశెనగ రైతులనూ మోసం చేశాడని ఆరోపణలు

రాత్రికి రాత్రే వే బ్రిడ్జ్ తొలగింపు.. వ్యాపారిని పోలీసులకు అప్పగించిన రైతులు

సొంత వే బ్రిడ్జ్‌(కాటా)ను అడ్డుపెట్టుకొని చీని, మొక్కజొన్న, వేరుశెనగ రైతులకు టన్నుల కొద్దీ తక్కువ తూకాలు చూపిస్తూ లక్షల్లో డబ్బులు దోచుకున్నాడంటూ రైతులు ఓ వ్యాపారిని పట్టణ పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని అక్కమ్మదేవి ఆలయం సమీపంలోని లక్ష్మివెంకటేశ్వర వే బ్రిడ్జ్ వద్ద వెలుగుచూసింది.గూబనపల్లి గ్రామానికి చెందిన రైతులు తిప్పన్న చౌదరి తదితరులు తెలిపిన వివరాల మేరకు.. వ్యాపారస్తుడు రమూర్తి మొక్కజొన్న, వేరుశెనగ వ్యాపారంతో పాటు చీని కాయల కొనుగోళ్లు నిర్వహిస్తూ సొంతంగా వే బ్రిడ్జ్‌ను నిర్వహిస్తున్నాడు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు తన కాటాలో తక్కువ తూకాలు చూపిస్తూ భారీగా డబ్బులు మోసం చేస్తున్నాడని రైతులు ఆరోపించారు.

అనుమానం రావడంతో రైతులు అనంతపురంలోని సుధీర్ వే బ్రిడ్జ్‌లో చీని కాయలను తిరిగి తూకం వేయించగా అసలు విషయం బయటపడిందన్నారు. టన్నుల కొద్దీ తేడాలు రావడంతో రైతులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనిపై రమూర్తిని నిలదీయగా ‘కాటా రిపేర్‌లో ఉంది’ అంటూ బుకాయించాడని తెలిపారు.
రైతులు పెద్దఎత్తున చేరుకొని ఆందోళనకు దిగుతారనే భయంతో రాత్రికి రాత్రే వే బ్రిడ్జ్‌ను పూర్తిగా తొలగించాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన గూబనపల్లి, విట్లంపల్లి రైతులు వ్యాపారి దుకాణానికి చేరుకొని అక్కడ ఉన్న తూకం మిషన్లను బయటకు పడేసి షాప్ షట్టర్ మూసివేశారు. అనంతరం నిర్వహుడు రమూర్తిని పట్టుకొని పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు.

మోసానికి పాల్పడిన నిర్వహుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు ఫిర్యాదు చేయగా పట్టణ సీఐ హరనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే మోసానికి పాల్పడిన వ్యక్తిని స్టేషన్‌లో కూర్చోబెట్టి రైతులను బయటకు పంపించారని పోలీసుల తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేశారు.దళారులతో చేతులు కలిపి చీని, మొక్కజొన్న, వేరుశెనగ రైతులను మోసం చేశాడని రైతులు మండిపడ్డారు. సొంత వ్యాపారానికి సొంత కాటాను అడ్డుపెట్టుకొని టన్నుల కొద్దీ తక్కువ తూకాలు చూపిస్తూ రైతుల కష్టార్జితాన్ని లక్షల్లో దోచుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Posted Under AP
Editor