పిల్లలకు మనమిచ్చే పెద్ద ఆస్తి విద్య మాత్రమే!

అనంతపురం జిల్లా,రాయదుర్గం.

  • పిల్లలకు మనమిచ్చే పెద్ద ఆస్తి విద్య మాత్రమే!
  • జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ – ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఎంతో అంకితభావంతో శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అలాంటి పాఠశాలల్లో చదువుకోవడం గొప్ప అదృష్టమన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి, విద్యార్థినులకు రాయదుర్గంలోని జయంతి రుద్రయ్య శెట్టి కళ్యాణ మండపంలో శుక్రవారం ఆయన ప్రతిభ పురస్కారాలను అందజేశారు. పదవ తరగతిలో 550 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 75మంది విద్యార్థిని విద్యార్థులతో పాటు, స్కూల్ టాపర్, 100% ఫలితాలు సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, 100% విద్యార్థులు పాసైన సబ్జెక్టు ఉపాధ్యాయులకు మెమెంటోలు, ప్రశంస పత్రాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల దశలోనే నవ సమాజ నిర్మాణానికి పునాది పడుతుందన్నారు. విలువలు, క్రమశిక్షణ అన్నీ ఈ దశలోనే అలవడతాయన్నారు. ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కష్టపడి ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి సుమారు రూ.90 వేల వరకు ఖర్చు చేస్తోందన్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాయదుర్గం నియోజకవర్గ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో నిలవాలన్నారు. మన విద్యార్థులు ప్రతిభలో ఎవరికీ తీసిపోరని, సరైన దిశలో శ్రమిస్తే అత్యున్నత స్థానాలు అధిరోహించే సామర్థ్యం ఉందన్నారు. ప్రజాప్రతినిధుల కంటే బ్యూరోక్రసీకే సమాజానికి సేవ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. భౌగోళికంగా, నైసర్గికంగా రాయదుర్గం కర్ణాటక సరిహద్దుల్లో ఉండటంతో ఇతర ప్రాంతాలకు తీసుపోనీ విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. చదువు విలువ తెలిసిన వ్యక్తి కావడంతోనే ఆనంద్ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో నెగ్గి కలెక్టర్ పదవి పొందారన్నారు. రాయదుర్గం ప్రాంత విద్యార్థులు కూడా ఆయనలాగే విద్యలో ప్రతిభావంతులై ఉన్నత స్థానాలకు చేరాలని ఎమ్మెల్యేగా తాను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో తగిన శిక్షణ లేని వారు కూడా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అర్హతలు, అనుభవం, బాధ్యతతో కూడిన ఉపాధ్యాయ వ్యవస్థ విద్యార్థుల భవిష్యత్తును బలంగా తీర్చిదిద్దుతోందన్నారు. అత్యంత ప్రతిభావంతులు కావడం వల్లే పోటీ పరీక్షల్లో లక్షల మందితో పోటీపడి ఉద్యోగాలు సాధిస్తున్నారన్నారు. సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో చదవి మీ కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల అందమైన భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు చక్కగా శ్రమిస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని గౌరవిస్తూ… భవిష్యత్తులో ఈ ప్రాంతానికి, గర్వకారణంగా నిలవాలన్నారు.

Posted Under AP
Editor