హనుమాపురం రైతుల ఫిర్యాదు..
మట్టి ఆరోపణలు తప్పుడు
ప్రచారాలు మానుకో..
గౌని ప్రతాపరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్…
అనంతపురం జిల్లా కణేకల్ మండలం పరిధిలోని హనుమాపురం గ్రామంకు చెందిన రైతులు మరియు గ్రామ ప్రజలు కణేకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాయదుర్గంలో బుధవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పుకునే గౌని ప్రతాపరెడ్డి గ్రామ రైతులపై తప్పుడు ఆరోపణలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామానికి వచ్చి వాస్తవాలు తెలుసుకోకుండా హనుమాపురం గ్రామంలో మట్టి దోపిడీ జరుగుతోందని ఆరోపించడం బాధ్యతారాహిత్యమని రైతులు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా విస్తృతంగా జరిగిందని, అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోందన్నారు.
ఎండాకాలంలో చెరువులు, కుంటలలోని పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకోవడం పెద్దల కాలం నుంచి కొనసాగుతున్న వ్యవసాయ పద్ధతేనని తెలిపారు. పూడిక మట్టిని పొలాలకు వినియోగించడం వల్ల నేల సారవంతమై పంట దిగుబడి పెరుగుతుందని, రైతులకు ఆర్థికంగా లాభం కలుగుతుందని పేర్కొన్నారు.
అలాగే చెరువులలో పూడిక తొలగించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జలాలు కూడా అభివృద్ధి చెందుతాయని రైతులు వివరించారు. ఈ ప్రక్రియ వల్ల గ్రామాలకు, రైతులకు ఉపయోగమే తప్ప ఎటువంటి నష్టం లేదన్నారు.
రాజకీయ కుట్రలలో భాగంగా అధికార పార్టీపై విమర్శలు చేయడం గౌని ప్రతాపరెడ్డికి అలవాటైందని రైతులు ఆరోపించారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా రైతులపై నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన రైతులు, ప్రజలు కలిసి వ్యవసాయ అవసరాల కోసం చెరువుల మట్టిని వినియోగిస్తున్నారని చెప్పారు.
వ్యవసాయం కోసం చెరువులోని మట్టిని తీసుకోవడాన్ని పెద్ద నేరంలా చూపించడం సరైంది కాదని పేర్కొన్నారు. రైతుల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్న గౌని ప్రతాపరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రైతులను రాజకీయాలకు బలిచేయకుండా ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
