పత్రికల్లో వచ్చిన ఆరోపణలు నిరాధారం.. కోర్టు ఆదేశాల ప్రకారమే చర్యలు” — తహసీల్దార్ చల్లం భాస్కర్ రెడ్డి

తాడిమర్రి (yes9tv )పత్రికల్లో వచ్చిన ఆరోపణలు నిరాధారం..
కోర్టు ఆదేశాల ప్రకారమే చర్యలు”
— తహసీల్దార్ చల్లం భాస్కర్ రెడ్డి

తాడిమర్రి మండలం ఏం అగ్రహారం గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 527-9లో ఉన్న 4.50 ఎకరాల భూమి వివాదంపై ఇటీవల కొన్ని పత్రికల్లో ప్రచురితమైన వార్తలు వాస్తవాలకు విరుద్ధమని సంబంధిత రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు.
ఈ నెల 09-05-2026న ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వార్త, లేపాక్షి టైమ్స్ పత్రికల్లో రెవెన్యూ అధికారులపై ఆక్రమ ఆరోపణలు చేస్తూ ప్రచురితమైన ప్రత్యేక కథనాల నేపథ్యంలో అధికారులు అధికారిక వివరణ విడుదల చేశారు.
అధికారుల వివరాల ప్రకారం, తాడిమర్రి మండలం ఏం అగ్రహారం గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 527-9లోని 4.50 ఎకరాల భూమిని ఆత్మకూరు గ్రామ నివాసి ముసుగు చిన్నప్ప నుంచి బత్తలపల్లి మండలం ఎం. రామాపురం గ్రామ నివాసి ముసుగు నారాయణస్వామి 17-03-1975న డాక్యుమెంట్ నెంబర్ 31927/1975 ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు అనంతరం పట్టాదారు పాస్ పుస్తకాలు పొందకపోయినా, ఆ భూమిని సాగు చేసుకుంటూ వచ్చినట్లు పేర్కొన్నారు.
అయితే రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ముసుగు చిన్నప్ప పేరు కొనసాగిందని, ఆయన మరణానంతరం భార్య ముసుగు లక్ష్మమ్మ 2017లో పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినట్లు తెలిపారు. అనంతరం 04-03-2024న డాక్యుమెంట్ నెంబర్ 10196/2024 ద్వారా పట్రపల్లె గ్రామ నివాసి కల్లే లక్ష్మీదేవి భర్త కె. శివయ్యకు భూమి రిజిస్ట్రేషన్ జరిగినట్లు వెల్లడించారు.
ఈ భూమికి సంబంధించి ముసుగు లక్ష్మమ్మ ధర్మవరం జూనియర్ సివిల్ కోర్టులో OS నెంబర్ 282/2020 దాఖలు చేసినట్లు తెలిపారు. అలాగే 07-03-2024న ఆటో మ్యుటేషన్ ప్రక్రియ ద్వారా భూమి కల్లే లక్ష్మీదేవి పేరుకు మారినట్లు వివరించారు.
ప్రస్తుతం ఈ భూ వివాదానికి సంబంధించి ధర్మవరం జూనియర్ సివిల్ కోర్టులో OS నెంబర్ 472/2025 కేసు విచారణలో కొనసాగుతోందని, 31-10-2025న కోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కోర్టు తుది ఉత్తర్వులు వెలువడే వరకు భూమిపై ఎవరికీ ప్రత్యేక హక్కులు లేకుండా స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు సమాచారం అందించినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు చట్టపరమైన విధానాల ప్రకారమే వ్యవహరించారని, తమపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తహసీల్దార్ చల్లం భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.

Posted Under AP
Editor