- శాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు
ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు - వినియోగించుకోవాలి: ఎస్సై నభి రసూల్
బొమ్మనహాల్ నవంబర్
YES 9 TV News
మండల పరిధిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బొమ్మనహాల్ మండల ఎస్సై నభి రసూల్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించడం, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గ్రామాల్లో పోలీసు సిబ్బందితో నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన చోట అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పోలీసు శాఖకు సహకరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి ప్రశాంతమైన ఎన్నికలకు సహకరించాలని ఎస్సై నభి రసూల్ విజ్ఞప్తి చేశారు.
