ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న 300 చీరలు, రూ.50,200 నగదు స్వాధీనం..

YES 9 TV News

  • ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న 300 చీరలు, రూ.50,200 నగదు స్వాధీనం
  • ముగ్గురు వ్యక్తులతో పాటు అభ్యర్థి భర్త
  • అరెస్టు.. మూడు ద్విచక్ర వాహనాలు సీజ్

బొమ్మనహాళ్, నవంబరు 4
ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు చీరలు, నగదు పంపిణీ చేయడం చట్టరీత్యా నేరమని బొమ్మనహాళ్ మండల ఎస్సై నభీ రసూల్ తెలిపారు. మండలంలోని సిద్ధరాంపురం గ్రామ శివార్లలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి భారీగా చీరలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.బళ్లారి నుంచి కురువల్లి గ్రామానికి ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలను తరలిస్తున్నారన్న సమాచారంతో బొమ్మనహాళ్ ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్సై నభీ రసూల్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 300 చీరలు, రూ.50,200 నగదుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చీరల విలువ సుమారు రూ.1.20 లక్షలుగా అంచనా వేశారు.
ఈ ఘటనలో కురువల్లి గ్రామానికి చెందిన వన్నూర్ అజయ్, పరశురాం, సిద్ధరాంపురం గ్రామానికి చెందిన చిన్న ఆంజనేయులతో పాటు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి గౌరమ్మ భర్త హరికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Posted Under AP
Editor