*రాయదుర్గం లో సహజ వనరుల దోపిడీని వెంటనే అరికట్టాలి* *గౌని ప్రతాప్ రెడ్డి
*
రాయదుర్గం పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
రాయదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా జరుగుతున్న సహజ వనరుల దోపిడీని వెంటనే అరికట్టాలని భారతీయ కాంగ్రెస్ పార్టీ రాయదుర్గం అధ్యక్షుడు, ఇన్‌చార్జ్ గౌని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయదుర్గంలో భారీ స్థాయిలో ఇసుక, మట్టి దోపిడీతో పాటు అక్రమ క్వారీలు, క్రషర్లు నిర్భయంగా కొనసాగుతున్నాయని ఆరోపించారు.
రాష్ట్రంలోనే అత్యధిక అవినీతి, అక్రమాలు, దందాలు రాయదుర్గంలో జరుగుతున్నప్పటికీ అధికారులు, కూటమి నాయకులు అన్నీ సవ్యంగా ఉన్నట్టుగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిని కాపాడుతున్నారని విమర్శించారు. సాంకేతిక పరిజ్ఞానం, డాష్‌బోర్డ్ పాలన గురించి చెప్పుకునే ప్రభుత్వం రాయదుర్గంలో జరుగుతున్న దోపిడీని గుర్తించలేకపోతుందా? లేక తెలిసీ చూడనట్టుగా వ్యవహరిస్తుందా? అని ప్రశ్నించారు.
రాయదుర్గం నియోజకవర్గంలోని పలు చెరువుల్లో భారీగా మట్టి దోపిడీ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. డి.హీరేహాళ్ మండల లోని హులికల్లు చెరువు, దొడగట్ట చెరువు, మల్లికేతి చెరువు, రాయదుర్గం మండలం వేపరాళ్ల చెరువు, నాయిని చెరువు ప్రాంతాల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. నాయిని చెరువులో నుంచి మట్టిని కర్ణాటక రాష్ట్రంలోని మొలకాల్మూరు ప్రాంతంలోని ఇటుక ఫ్యాక్టరీలకు తరలించి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
అలాగే తుంగభద్ర కాలువ గట్టు మట్టిని పూర్తిగా తరలించారని, కణేకల్‌లో రాయదుర్గం నీటి సరఫరా కోసం నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలోని మట్టి కూడా దోపిడీకి గురైందన్నారు. ప్రస్తుతం కణేకల్ మండలం ఎన్.హనుమాపురం చెరువులో భారీ టిప్పర్లు, హిటాచీలతో వందల లోడ్ల మట్టిని అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారని విమర్శించారు.
రైతులు చెరువుల్లోని పూడిక మట్టిని మాత్రమే వ్యవసాయ అవసరాల కోసం తీసుకెళ్తారని, కానీ ప్రస్తుతం లోతుగా తవ్వి తీస్తున్న మట్టి రైతులకు పనికిరాదని, రైతుల పేరుతో అక్రమ మట్టి దందా సాగుతోందని ఆరోపించారు. రాజకీయ నాయకుల అండదండలు లేకుండా ఇంత పెద్ద స్థాయిలో దోపిడీ జరగదని స్పష్టం చేశారు.
జిల్లా అధికారులు వెంటనే స్పందించి చెరువులను కాపాడాలని, వాటిపై ఆధారపడి జీవిస్తున్న రైతులను రక్షించాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాయదుర్గం పరిస్థితిపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
నీటిపారుదల శాఖ అధికారులు తమ బాధ్యతలను విస్మరించి అక్రమ మట్టి దందాకు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించిన గౌని ప్రతాప్ రెడ్డి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తామని, అలాగే అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఎస్పీ, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మెహబూబ్ భాషా, మహమ్మద్ రఫీక్, వసంత కుమార్ గౌడ్, జయన్న, ఉమ్మర్ ఫరూక్ తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
రాయదుర్గం లో సహజ వనరుల దోపిడీని వెంటనే అరికట్టాలి:గౌని ప్రతాప్ రెడ్డి
