Latest Posts

కొంపెల్ల మాధవిలతపై క్రిమినల్ కేసు..

లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తోన్న వేళ.. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత ఇబ్బందుల్లో పడ్డారు. ఆమెపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 

కొద్దిరోజుల కిందటే మాధవీలతకు చెందిన ఓ వివాదాస్పద వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుపై దుమారం చెలరేగింది. హైదరాబాద్‌ పాతబస్తీ సిద్ధి అంబర్‌ బజార్‌ మీదుగా ఈ శోభా యాత్ర కొనసాగుతున్న సమయంలో మాధవీలత.. ఓ మసీదుపైకి విల్లు ఎక్కుపెట్టి బాణం వదులుతున్నట్లుగా ఫోజు ఇచ్చారు.

 

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో సంచలనం రేపాయి. ఈ వీడియో వైరల్‌‌గా మారింది. మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా మాధవీలత వ్యవహరించిందంటూ హైదరాబాద్‌ సిట్టింగ్ ఎంపీ, మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. పాతబస్తీలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించారని విమర్శించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ దీనిపై స్పందించాలంటూ అప్పట్లో డిమాండ్ చేశారాయన.

 

ఇదే అంశంపై మహ్మద్ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. మాధవీలత ప్రవర్తన మైనారిటీల మనోభావాలను కించపరిచేలా ఉందని పేర్కొన్నారు. ఆమెపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

 

ఈ ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు మాధవీలతపై క్రిమినల్ కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉద్దేశపూరకంగా ఓ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యవహారించారనే కారణంపై ఆమెపై ఐపీసీ సెక్షన్ 295/ఏ కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Editor