గుత్తి సమీపంలో దారుణ ఘటన.. కారులో సజీవ దహనం..

అనంతపురం జిల్లా గుత్తి మండలం టి.కొత్తపల్లి గ్రామ సమీపంలోని NH 67వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమవగా, కారులో ఉన్న ఓ వ్యక్తి సజీవదహనమైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఏపీ09 సీఎం 264 నంబర్ గల కారు టి.కొత్తపల్లి సమీపంలో వెళ్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు తీవ్రరూపం దాల్చడంతో కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి బయటకు రాలేక సజీవదహనమైనట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న గుత్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. సంఘటన స్థలంలో డీజిల్ క్యాన్లు, ఇతర వస్తువులు లభ్యమవడంతో ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది ప్రమాదవశాత్తూ జరిగిన అగ్నిప్రమాదమా? లేక ఉద్దేశపూర్వకంగా కారుకు నిప్పంటించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి గుర్తింపు, ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు ఫోరెన్సిక్ నివేదికలు, పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.
కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Posted Under AP
Editor