- ఈనెల 14లోపు ఎస్ఐఆర్ పూర్తి చేయాలి
- వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశం
- నిర్లక్ష్యంపై కఠిన చర్యలు.. కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ
అనంతపురం, జూలై 2 :
జిల్లాలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఈనెల 14వ తేదీలోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. సమయం చాలా తక్కువగా ఉన్నందున ప్రతి బీఎల్‌ఓ లక్ష్యాన్ని నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సూచించారు. అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.
గురువారం అనంతపురం అర్బన్ పరిధిలోని నారాయణపురం పంచాయతీలో పోలింగ్ స్టేషన్ నం.10 పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, వాటి స్వీకరణ, ఫారాల నింపే విధానంపై బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు, ఓటర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఓటరికి ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఫారాలను ఓటర్ల సమక్షంలోనే పూర్తి చేయించాలని సూచించారు.
అదనపు సిబ్బందిని బీఎల్‌ఓలకు అనుసంధానం చేయాలని, డీఆర్‌డీఏతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందిని కూడా ఎస్ఐఆర్ విధుల్లో వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు. నగరంలో మెప్మా, టౌన్ ప్లానింగ్ సిబ్బందిని కూడా విధుల్లో నియమించాలని నగర పాలక సంస్థ కమిషనర్‌కు ఫోన్ ద్వారా సూచనలు ఇచ్చారు.
ఎస్ఐఆర్ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతిరోజూ బీఎల్‌ఓలు, ఇతర సిబ్బంది హాజరు, పనితీరును పరిశీలించాలని ఆదేశించారు. ఎక్కడైనా ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోతే సమీప బీఎల్‌ఓల సహకారంతో వెంటనే పంపిణీ చేయాలని సూచించారు. సేకరించిన ఫారాలను ఎప్పటికప్పుడు డిజిటలైజ్ చేయాలని కూడా స్పష్టం చేశారు.
