ఒక్క ఉపాధ్యాయుడితో ఐదు తరగతులా..?

  • ఒక్క ఉపాధ్యాయుడితో ఐదు తరగతులా..?
  • ప్రభుత్వ పాఠశాల ఎదుట కాలనీ వాసుల ధర్నా
  • అదనపు టీచర్ నియామకానికి డిమాండ్.. 10 రోజుల్లో పంపిస్తామని ఎంఈఓ హామీ

అనంతపురం జిల్లా కణేకల్ మండలం సంజయ్ నగర్ కాలనీలోని మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అదనపు ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేస్తూ గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు, కాలనీ వాసులు, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నప్పటికీ, గత ఏడాది నుంచి కేవలం ఒక్క ఉపాధ్యాయుడే విధులు నిర్వహిస్తున్నారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు తరగతులకు బోధనతో పాటు పాఠశాల పరిపాలన, మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ బాధ్యతలు కూడా ఒకే ఉపాధ్యాయుడిపై ఉండటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆరోపించారు.
సంజయ్ నగర్ కాలనీలో ఎక్కువ మంది నిరుపేదలు, ఎస్సీ వర్గానికి చెందిన కుటుంబాలేనని, ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చదివించే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలపైనే ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్నా విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి (ఎంఈఓ) పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకారులతో చర్చించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, 10 రోజుల్లోగా అదనపు ఉపాధ్యాయుడిని నియమిస్తామని హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు ధర్నాను విరమించారు. అనంతరం ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు.
ధర్నాలో సంజయ్ నగర్ విజన్ టీం సభ్యులు దయానిధి, ఎర్రిస్వామి, తమ్మరాజ్, రాము, తిప్పేష్, నాగేంద్ర, తిమ్మప్ప, శివన్న, బాబు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కాలనీ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor