ఎస్ఐఆర్ వేగవంతం చేయాలి:జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ ఆదేశం

 

అనంతపురం, జూలై 3: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఆర్టీవో కార్యాలయం పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీలోని పోలింగ్ స్టేషన్ నెం.274, ఆర్టీవో కార్యాలయం పరిధిలోని పోలింగ్ స్టేషన్ నెం.275లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్ఓలు, ఓటర్లతో మాట్లాడి ఫారాల పంపిణీ తీరు, ప్రతి ఓటరికి ఫారం అందిందా, నింపడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీలోపు ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. ఎలాంటి అలసత్వానికి తావులేకుండా ప్రత్యేక దృష్టితో కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సూపర్వైజర్లు, బీఎల్ఓలకు మెప్మా ఆర్పీలు, సిబ్బంది సహకారం అందించాలని చెప్పారు.
తనిఖీల్లో ఫారెస్ట్ ల్యాండ్ సెటిల్మెంట్ అధికారి జి. రామకృష్ణారెడ్డి, సూపర్వైజర్లు, బీఎల్ఓలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor