– కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోత్తు -అంగన్‌వాడీ కార్యకర్త వేధింపుల కేసులో నిందితుడిపై ఉక్కుపాదం మోపాలి..

– కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోత్తు -అంగన్‌వాడీ కార్యకర్త వేధింపుల కేసులో నిందితుడిపై ఉక్కుపాదం మోపాలి..
–అధికార పార్టీ నేతలను కాపాడుతున్నారా..?పోలీసుల తీరుపై సీపీఐ మండిపాటు..
–బాధితురాలికి పూర్తి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం..
–త్వరలో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తాం..సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య
ఆలూరు న్యూస్…
కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త లేపాక్షమ్మపై వేధింపులు జరిగాయన్న ఆరోపణల కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ నాయకులతో కలిసి బాధితురాలి నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించిన ఆయన, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితురాలికి పూర్తి న్యాయం జరిగే వరకు సీపీఐ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గిడ్డయ్య మాట్లాడుతూ, గత నాలుగు నెలలుగా స్థానిక టీడీపీ నాయకుడు వీరేశ్ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి లేపాక్షమ్మను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు. ఆ వేధింపులను భరించలేక ఆమె విషగుళికలు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదైనప్పటికీ నిందితుడిపై ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు అందరూ సమానమేనని ప్రభుత్వం, పోలీసు అధికారులు తరచూ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని గిడ్డయ్య ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోందన్నారు. నేరాలకు పాల్పడిన వారిపై చట్టం తన పని చేయాల్సిన సమయంలో పోలీసు వ్యవస్థ మౌనంగా ఉండటం అత్యంత దురదృష్టకరమని ఆయన విమర్శించారు. సమాజంలో మహిళల భద్రతకు భరోసా కల్పించాల్సిన యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. పోలీసులు తమ అధికారాన్ని బలహీనులపై కాకుండా చట్టాన్ని ధిక్కరించే వారిపై చూపించాలని సూచించారు. ప్రత్యేకించి అనగారిన వర్గాలకు చెందిన మహిళలు వేధింపులకు గురైతే వారికి వెంటనే న్యాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గిడ్డయ్య పేర్కొన్నారు. కానీ ఈ కేసులో దర్యాప్తు, నిందితుడిపై చర్యల విషయంలో జరుగుతున్న జాప్యం బాధిత కుటుంబాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని అన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే జిల్లా ఎస్పీ స్వయంగా జోక్యం చేసుకుని కేసును పర్యవేక్షించాలని, నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలికి పూర్తి న్యాయం చేయాలని కోరుతూ త్వరలోనే జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు నాగరాజు, వన్నూరప్ప, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor