అనంతపురం, జూలై 2 : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడంతో పాటు సమగ్ర గ్రామాభివృద్ధికి దోహదపడే (విబీజీ రామ్‌జీ) పథకాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి గ్రామం నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ఈ పథకాన్ని ప్రారంభించారు.
అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనం నుంచి నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రారంభోత్సవాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ మాట్లాడుతూ, విబీజీ రామ్‌జీ పథకం కింద గ్రామీణ కార్మికులకు 125 రోజుల వేతన ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ రద్దీ కాలాల్లో కూలీల కొరత ఏర్పడకుండా విత్తనాల విత్తడం, పంట కోత వంటి సమయాల్లో గరిష్టంగా 60 రోజుల వ్యవసాయ విరామం ప్రకటించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించబడిందని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఈ పథకంలో నీటి వనరుల అభివృద్ధి పనులకు సుమారు 60 శాతం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పథకంపై క్షేత్రస్థాయి వరకు పూర్తి అవగాహన కల్పించి ప్రతి అర్హ కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గ్రామీణాభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. రైతులు, రైతు కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించడమే లక్ష్యంగా 125 రోజుల ఉపాధి హామీతో పథకాన్ని రూపొందించారని చెప్పారు. అనంతపురం జిల్లాకు ఈ పథకం ద్వారా విశేష ప్రయోజనాలు చేకూరనున్నాయని, ఉపాధి పనులను మరింత సమర్థవంతంగా అమలు చేసే అవకాశముందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కార్మికులను గౌరవించాలని, వ్యవసాయ విరామం సద్వినియోగం చేసుకొని రైతులు, కూలీలు లబ్ధి పొందాలని సూచించారు. జిల్లాను కరువు నుంచి బయటపడేసి సస్యశ్యామలం చేసే దిశగా ఈ పథకం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ సలీమ్ భాష, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ సుబ్బరాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
