తాడిమర్రి( yes9tv )”ప్రమాదం జరిగాక స్పందిస్తారా..? ముందే చర్యలు తీసుకుంటారా..?”బస్సులు లేక విద్యార్థుల అవస్థలు.. ఫుట్‌బోర్డుపై ప్రాణాలతో చెలగాటం..!
తాడిమర్రి–మేడిమేకలపల్లి విద్యార్థులకు రవాణా కష్టాలు.. వెంటనే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
తాడిమర్రి, జూలై 2: తాడిమర్రి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిధిలోని మేడిమేకలపల్లి జూనియర్ కళాశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు ప్రతిరోజూ తీవ్రమైన రవాణా సమస్యలతో సతమతమవుతున్నారు. గ్రామాల నుంచి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు, తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు సరిపడా ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శ్రీ శక్తి పథకం అమలు తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరగడంతో విద్యార్థులకు సీట్లు దొరకడం దూరంగా ఉండగా, కనీసం బస్సులో నిలబడే అవకాశం కూడా లేకుండా పోతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలామంది విద్యార్థులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఫుట్‌బోర్డులపై వేలాడుతూ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొందరు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించి, చివరకు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ఇళ్లకు చేరుకోవాల్సి వస్తోంది.
ఈ రవాణా సమస్య కారణంగా విద్యార్థులు తరచూ పాఠశాలలు, కళాశాలలకు ఆలస్యంగా చేరుకోవడంతో పాటు విద్యాభ్యాసంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందస్తు చర్యలు తీసుకుని విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
విద్యార్థుల రాకపోకలపై సంబంధిత అధికారులు వెంటనే దృష్టి సారించి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బస్సులను నడపాలని, అదనపు ఆర్టీసీ సర్వీసులను ఏర్పాటు చేయాలని, ఫుట్‌బోర్డు ప్రయాణాలను పూర్తిగా అరికట్టేలా చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యను అత్యవసరంగా పరిష్కరించి, సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ప్రమాదం జరిగాక స్పందిస్తారా? బస్సులు లేక తాడిమర్రి విద్యార్థుల ఫుట్‌బోర్డు ప్రయాణాలు!
