అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం – గోనుగుంట్ల భూషణ్

తాడిమర్రి( yes9tv )అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం – గోనుగుంట్ల భూషణ్
తాడిమర్రి,: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల భూషణ్ విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును ఇప్పటికీ జీర్ణించుకోలేక ప్రతిరోజూ కొత్త కొత్త వ్యాఖ్యలు, ఆరోపణలతో రాష్ట్రంలో అయోమయం, అభద్రతాభావం సృష్టించే ప్రయత్నం చేయడం ఆయన రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురి చేసిన జగన్, ఇప్పుడు కూడా ప్రజా ప్రభుత్వంపై ఆధారరహిత విమర్శలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేయడం బాధ్యతారాహిత్య రాజకీయాలకు నిదర్శనమన్నారు.
ప్రజలు ఇప్పటికే తమ తీర్పుతో ఆయన రాజకీయ అహంకారానికి గట్టి సమాధానం ఇచ్చినా, ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రతిరోజూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవాలనే ప్రయత్నం చేయడం ప్రజా తీర్పును అవమానించడమేనని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి దిశగా చర్యలు చేపట్టడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని తెలిపారు.
ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్రంలో అనవసర అపోహలు, భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షం అంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడం కాదని, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందన్నారు.
రాజకీయ స్వార్థం కోసం రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడడం, పెట్టుబడిదారుల్లో సందేహాలు కలిగించడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని గోనుగుంట్ల భూషణ్ డిమాండ్ చేశారు.
ప్రజలు ఇప్పటికే ఒకసారి గట్టి తీర్పు ఇచ్చారని, అదే వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్తులో ప్రజల నుంచే మరింత గట్టి సమాధానం తప్పదని ఆయన హెచ్చరించారు.

Posted Under AP
Editor