ఎస్ఐఆర్-2026లో జోరుగా ఎన్యుమరేషన్ ప్రక్రియ…

  • అనంతపురం జిల్లా కలెక్టరేట్
  • ఎస్ఐఆర్-2026లో జోరుగా ఎన్యుమరేషన్ ప్రక్రియ
  • జిల్లాలో 3.53 లక్షల ఫారాల పంపిణీ
  • 17.36 శాతం ఓటర్లకు చేరిన ఎన్యుమరేషన్ ఫారాలు: కలెక్టర్ ఓ. ఆనంద్

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-2026 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎన్యుమరేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
జిల్లాలో మొత్తం 20,38,523 మంది ఓటర్లు ఉండగా, 2,226 మంది బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటింటి సందర్శనలు నిర్వహిస్తూ ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు 3,53,890 మంది ఓటర్లకు ఫారాలను అందజేయడం జరిగిందన్నారు.
ఇప్పటివరకు జిల్లాలో 17.36 శాతం మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు చేరాయని పేర్కొన్నారు. అలాగే 3,476 పూరించిన ఫారాలను తిరిగి స్వీకరించి ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసినట్లు తెలిపారు. ఇది మొత్తం ఓటర్లలో 0.17 శాతానికి సమానమన్నారు.
జూన్ 15 నుంచి జూలై 14 వరకు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి రెండు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారని, అందులో ఒక పూరించిన ఫారాన్ని తిరిగి స్వీకరిస్తారని కలెక్టర్ వివరించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు), రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ విజ్ఞప్తి చేశారు.

Posted Under AP
Editor