కార్మికుల సమస్యలను మంత్రికి వివరిస్తా: సిఐటియు నాయకులకు ఎమ్మెల్యే కాలవ హామీ.

అనంతపురం జిల్లా రాయదుర్గం

కార్మికుల సమస్యలను మంత్రికి వివరిస్తా: సిఐటియు నాయకులకు ఎమ్మెల్యే కాలవ హామీ.

మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కు వివరిస్తానని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కార్మికులకు హామీ ఇచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు వివిధ సమస్యలపై సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులుగా దశాబ్దాలుగా సేవలందిస్తున్న తమకు ప్రభుత్వపరంగా ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆందోళన వ్యక్తపరిచారు. కనీసం పక్కా ఇంటికి కూడా నోచుకోలేక పోతున్నామని ఆవేదన చెందారు. చాలీచాలని వేతనంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేశారు. పీఆర్సి ద్వారా కనీసం వేతనం పెరుగుతుందని ఎదురు చూస్తుంటే దాన్ని కూడా నాలుగేళ్లుగా అమలు చేయడం లేదని తెలిపారు. మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో చెత్త తరలింపుకు ప్రైవేట్ వెహికల్స్ అద్దెకు తీసుకుంటుండటం వల్ల కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని వివరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, పక్కా ఇల్లు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే కాలవ సానుకూలంగా స్పందిస్తూ… కొన్ని అంశాలపై ఇదివరకే ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరిగాయన్నారు. కార్మికులు ప్రభుత్వం నుండి వేతనం చేసుకుంటుండటం వల్ల సంక్షేమ పథకాలు వర్తించడం లేదన్నారు. వీటిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

Posted Under AP
Editor