అనంతపురం జిల్లా, రాయదుర్గం.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
-ఎమ్మెల్యే కాలవ
పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం, కాలుష్య నియంత్రణను ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాయదుర్గం పట్టణంలో శుక్రవారం అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేలా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కాలుష్య సమస్య ప్రపంచ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్నారు. పర్యావరణంపై అవగాహన పెంపొందించడం, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, నాణ్యమైన జీవనానికి అవసరమైన అలవాట్లను పెంపొందించడం ప్రతి ఒక్కరు కర్తవ్యంగా స్వీకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ సంరక్షణకు కట్టుబడి ఉండే ప్రతిజ్ఞ చేయాలని కోరారు. మొక్కలు నాటడం ఎంత అవసరమో, వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రతి వ్యక్తి తన ఇంటితో పాటు పరిసరాలు, గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించగలమన్నారు. ప్రస్తుతం తాగే నీరు, తినే ఆహారం, పీల్చే గాలి కూడా కాలుష్య ప్రభావానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అందరూ ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యక్తి కనీసం 10 నుంచి 20 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ “తల్లి పేరుతో ఒక మొక్క” అనే నినాదంతో దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం విస్తృత కార్యాచరణ చేపడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలన్నారు.
2014-19 కాలంలో “రాయదుర్గం హరిత స్వర్గం” కార్యక్రమం కింద రాయదుర్గం నియోజకవర్గంలో సుమారు 7.50 లక్షల మొక్కలు నాటిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో భారీ స్థాయిలో మొక్కల పెంపక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరు నుంచి జూలై నెలాఖరు వరకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటే ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, క్లస్టరు ఇంఛార్జీలు పోరాళ్ల పురుషోత్తము, ఇనాయత్, మాజీ కౌన్సిలర్లు కడ్డిపూడి మహబూబ్ బాషా, బండి భారతి,పైతోట రామంజి,వేణు,కరెన్న, కొండాపురం శ్రీనివాసులు, పూజరి శివ ,కెడిమి తిప్పేస్వమి,ఎల్లప్ప,మల్లికార్జున,కావలి రవి తదితరులు పాల్గొన్నారు.
