ఆలూరు న్యూస్ –
ఆలూరులోని ఆదోని రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉండే అమ్మ ప్రైవేట్ ఆసుపత్రిని బుధవారం రోజున అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ హాస్పిటల్‌లో స్కానింగ్ మిషన్ సీజ్ చేశారు. ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని ‘అమ్మ’ హాస్పిటల్‌లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న లింగ నిర్ధారణ (గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ) స్కానింగ్ యంత్రాన్ని రెవెన్యూ మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా దాడి చేసి సీజ్ చేశారు.
కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు:
పక్కా సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి లైసెన్స్ లేదా అనుమతులు లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి యంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాల మేరకు అధికారులు అమ్మ హాస్పిటల్‌పై మెరుపు దాడి నిర్వహించారు.
హాస్పిటల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు, స్కానింగ్ మిషన్‌కు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు యాజమాన్యం వద్ద లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో తక్షణమే ఆ యంత్రాన్ని సీజ్ చేసి, సీల్ వేశారు. చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.ఈ తనిఖీల్లో ఆలూరు తహసిల్దార్ శోభా సువర్ణమ్మ, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ సత్యవతి, స్థానిక రెవెన్యూ అధికారులు ఆర్ ఐ) బసవన్న గౌడ్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అక్కమ్మ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
