Latest Posts

తెలంగాణ చేయూత పింఛన్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం: అదనపు వర్గాలకూ ‘తక్షణ మంజూరు’ విస్తరణ.. భర్త మరణిస్తే భార్యకు వెంటనే పింఛన్!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పథకం పింఛన్లకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సాధారణ చేయూత పింఛనుదారుడైన భర్త మరణిస్తే భార్యకు వెంటనే పింఛన్ ఇచ్చే విధానం అమల్లో ఉండగా, తాజాగా ఈ ‘తక్షణ మంజూరు’ విధానాన్ని మరింతగా విస్తరించింది. ఇకపై దివ్యాంగులు, డయాలసిస్, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితులతో పాటు చేనేత, గీత కార్మికుల కేటగిరీల్లో పింఛన్ అందుకునే లబ్ధిదారులు మరణించినా వారి భార్యలకు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మంత్రి సీతక్క ఆదేశాలతో అధికారులు సమగ్ర ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం.. సదరు కేటగిరీల కింద పింఛన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుడి భార్య వయస్సు 57 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే వితంతు పింఛనును మంజూరు చేస్తారు. ఒకవేళ ఆమె వయస్సు 57 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వృద్ధాప్య పింఛను కింద పరిగణించి నగదు సహాయాన్ని అందిస్తారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే నిరుపేద మహిళలకు ఈ విధానం తక్షణ ఆర్థిక భరోసాగా నిలవనుంది.

ఈ పింఛన్ పొందగోరే మహిళలు భర్త మరణించిన 15 రోజుల్లోగా అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భార్య ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ, మరణించిన భర్త ఆధార్ కార్డు మరియు డెత్ సర్టిఫికెట్‌ను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్‌కు అందజేయాలి. అధికారులు క్షేత్రస్థాయిలో ఆ పత్రాలను పరిశీలించి, చేయూత పోర్టల్‌లో వివరాలను నమోదు చేసి అర్హత ధ్రువీకరించిన వెంటనే మరుసటి నెల నుంచే పింఛన్ మంజూరు చేస్తారు.

Editor