తాడిమర్రి (yes 9 tv)తాడిమర్రి మండలం, చిల్లకొండయ్యపల్లి – బంగారంపేట గ్రామాల మధ్య ఘటన
తాడిమర్రి మండల కేంద్ర పరిధిలోని చిల్లకొండయ్యపల్లి, బంగారంపేట గ్రామాల మధ్య ఉన్న మోదలకుంట ప్రాంతంలో ఆరవేటి కాటమయ్యకు చెందిన వ్యవసాయ పొలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.
సమాచారం మేరకు, శుక్రవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్లు పొలంలో ఒక వ్యక్తి కదలికలు లేకుండా పడిఉండడాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా అతను మృతి చెందినట్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. అనంతరం స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతుడు పురుషుడిగా గుర్తించగా, అతని వయస్సు సుమారు 40 సంవత్సరాల వరకు ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు. అయితే మృతదేహం ముఖభాగం నేలవైపు ఉండటంతో పాటు ముఖాన్ని సరిగా గుర్తించలేని పరిస్థితి ఉండటంతో అతను ఎవరు అనే విషయం ఇంకా తెలియరాలేదు.
వ్యక్తి సహజ మరణమా, ప్రమాదవశాత్తూ మృతిచెందాడా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే అంశాలు ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.
మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక మరియు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన స్థానిక ప్రజల్లో ఆందోళనకు గురిచేసింది.
తాడిమర్రి పరిధిలో కలకలం: వ్యవసాయ పొలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
