అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు స్వామివారి పల్లకి సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ సాంప్రదాయాల ప్రకారం అర్చకులు స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఈ సేవ కన్నులపండువగా సాగింది.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ, పాలకమండలి సభ్యులు మరియు సిబ్బంది సమక్షంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పల్లకి సేవ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ జరిగింది.
