Latest Posts

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 24 మందికి రూ.13.25 లక్షల ఆర్థిక సాయం : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 24 మందికి రూ.13.25 లక్షల ఆర్థిక సాయం : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

రాయదుర్గం నియోజకవర్గంలోని 24 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.13.25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. శనివారం తన స్వగృహంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు… గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అనేక మంది పేద ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు స్వంతంగా వైద్య ఖర్చులు భరించే స్థోమత లేక ఇబ్బందులు పడుతుంటారన్నారు. అటువంటి పరిస్థితుల్లో బంధువులు, మిత్రుల వద్ద అప్పులు చేసి చికిత్స చేయించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. అలాంటి నిరుపేద కుటుంబాలకు కొంతైనా ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. పేదలను ఆదుకోవాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయ నిధి ద్వారా భారీ మొత్తంలో ఆర్థిక సహకారం అందిస్తున్నారన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో గత రెండేళ్ల కాలంలో ఇప్పటివరకు 387 మందికి రూ.2 కోట్ల 58 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో సహాయం అందుతున్నప్పుడు లబ్ధిదారుల ముఖాల్లో కనిపించే ఆనందం, సంతృప్తి తమకు మరింత సేవా స్పూర్తిని కలిగిస్తుందన్నారు. భర్తను కోల్పోయిన ఓ మహిళకు రూ.1 లక్ష ఆర్థిక సాయం మంజూరైందని, అలాగే మెదడు సంబంధిత సమస్యతో శస్త్రచికిత్స చేయించుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో వ్యక్తికి రూ.1 లక్ష మంజూరైనట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలవడం ఎంతో గొప్ప విషయమన్నారు. కష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందన్న ధీమా వారిలో కల్పించడం జరుగుతోందన్నారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థంగా ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కాదలూరు మోహన్ రెడ్డి, కురుబ మల్లెన్న, వన్నారెడ్డి, కాలవ సన్నన్న, ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు లాలేప్ప, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor