కంబదూరులో విద్యుత్ సమస్యపై రైతుల ఆందోళన….

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.

కంబదూరులో విద్యుత్ సమస్యపై రైతుల ఆందోళన

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో కొనసాగుతున్న విద్యుత్ అంతరాయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఐదు రోజులుగా సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో గురువారం కంబదూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
వ్యవసాయ బోర్లు పనిచేయక పంటలకు నీరు అందడం లేదని, దీంతో తీవ్ర నష్టాలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
కంబదూరు టౌన్‌కు శాశ్వత లైన్‌మాన్ లేకపోవడమే సమస్యలకు ప్రధాన కారణమని రైతులు ఆరోపించారు. ఫ్యూజ్‌లు పోవడం, వైర్లు తెగిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్ లోపాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించే సిబ్బంది లేక గంటల తరబడి విద్యుత్ నిలిచిపోతోందని తెలిపారు.
“పోల్స్ ఎక్కి సమస్యలు పరిష్కరించే వారు లేరు.. అధికారులు ఫోన్‌లు కూడా ఎత్తడం లేదు.. రైతుల కష్టాలు ఎవరికీ పట్టడం లేదు” అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంబదూరుకు ప్రత్యేక లైన్‌మాన్‌ను నియమించి, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను రైతులు డిమాండ్ చేశారు.

Posted Under AP
Editor