ధర్మవరంలో పారిశ్రామిక విప్లవం: బత్తలపల్లిలో 35కు పైగా MSME పార్కులకు ఘన శంకుస్థాపన!

బత్తలపల్లి (yes9tv )బత్తలపల్లిలో 35కు పైగా MSME పార్కులకు ఘన శంకుస్థాపన
ధర్మవరం అభివృద్ధికి మరో ముందడుగు – యువతకు ఉపాధి, చేనేతకు కొత్త ఊపు
బత్తలపల్లి, మే 25: ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, పరిశ్రమలు, చేనేత రంగం, వైద్య విద్య, ఉపాధి అవకాశాల విస్తరణ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో “175 MSME Parks Program”ను వర్చువల్ విధానంలో ఘనంగా ప్రారంభించిన సందర్భంగా, శ్రీ సత్యసాయి జిల్లాలోని బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు సమీపంలో ఏర్పాటు చేయనున్న 35కు పైగా MSME పార్కులు మరియు FFC (Food Facilitation Centers) కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, ఇన్‌చార్జ్ ఆర్డీవో సువర్ణ, బత్తలపల్లి తహసిల్దార్, ఎంపీడీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ తరఫున నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో MSME పార్కుల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు మహిళా సంఘాలు, రైతులు, చిన్నతరహా వ్యాపారులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
FFC ఫుడ్ ఫెసిలిటేషన్ సెంటర్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు విలువ ఆధారిత ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. ధర్మవరం ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
అదేవిధంగా ధర్మవరం చేనేత రంగ అభివృద్ధికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక సహకారంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్‌కు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం త్వరలో నిర్వహించనున్నట్లు హరీష్ బాబు వెల్లడించారు. ఈ మెగా క్లస్టర్ ద్వారా ధర్మవరం చేనేతకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు రావడంతో పాటు వేలాది చేనేత కుటుంబాలకు ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని పేర్కొన్నారు.

Posted Under AP
Editor