విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి………

అనంతపురం జిల్లా,టౌన్.

*విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధం*

– *: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి*

– *: రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవిత*

– *విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధమని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవిత పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో శ్రీ కనకదాస ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం, శ్రీ కనకదాసు విద్య ఉపాధ్యాయ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కురుబ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి సవిత చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.*

– *ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయ సంఘాలు, విద్యా సంఘాలు ఐక్యతతో ముందుకు రావడం సంతోషకరమన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. “ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్ వంటి ఉన్నత లక్ష్యాలను సాధించే సత్తా మన పిల్లల్లో ఉంది” అని మంత్రి సవిత అన్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు మరింత కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతూ, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు సూచిస్తూ, పిల్లలపై ఒత్తిడి చేయకుండా వారి ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థులు సెల్‌ఫోన్ వినియోగాన్ని పరిమితం చేసి, విద్యపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నాణ్యమైన భోజనం, డిజిటల్ విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.“తల్లికి వందనం”, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. అలాగే సివిల్ సర్వీసుల కోచింగ్‌కు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.*

– *అనంతరం SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలల్లో మెరిట్ సాధించిన 12 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ప్రోత్సాహక నగదును మంత్రి అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 580కు పైగా మార్కులు సాధించిన పదో తరగతి నలుగురు విద్యార్థులకు రూ.25 వేల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. అదేవిధంగా 508 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ప్రోత్సాహకాలు అందించారు. ఈ రోజు ప్రతిభా అవార్డులు అందుకుంటున్న విద్యార్థులే రేపటి సమాజానికి ఆదర్శంగా నిలవాలి. ఉన్నత స్థానాలకు చేరుకుని తమ తల్లిదండ్రులు, గురువులు, సమాజానికి గర్వకారణంగా మారాలి” అని మంత్రి సవిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు, వివిధ విద్యా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.*

Posted Under AP
Editor