నీటి కొరతలో బత్తాయి తోటలను కాపాడుకునే విధానాలు…

నీటి కొరతలో బత్తాయి తోటలను కాపాడుకునే విధానాలు
కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ జి. త్రికల మాధవి సూచనలు
నీటి కొరత పరిస్థితుల్లో బత్తాయి తోటలను సంరక్షించేందుకు రైతులు అనుసరించాల్సిన పద్ధతులను కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ జి. త్రికల మాధవి వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రైతులు పాటించాల్సిన ముఖ్య సూచనలు:
చెట్ల చుట్టూ పాదులు కట్టి డ్రిప్ ద్వారా వారానికి రెండుసార్లు 7 నుండి 8 సంవత్సరాల వయస్సు గల చెట్లకు 120 నుంచి 150 లీటర్ల నీటిని అందించాలి. పాదులు కట్టడం వల్ల నీరు చెట్టు చుట్టూ ఎక్కువకాలం నిల్వ ఉంటుంది.
చెట్ల చుట్టూ 5 నుంచి 10 సెంటీమీటర్ల మందంతో మల్చింగ్ చేయాలి. ఇందుకోసం ఎండుగడ్డి, ఆకులు, కొబ్బరి చెక్కులు లేదా వేరుశనగ పొట్టును ఉపయోగించవచ్చు.
మల్చింగ్ విధానంలో భాగంగా విడ్‌మ్యాట్ ఉపయోగించుకోవచ్చు. విడ్‌మ్యాట్ వాడటం వల్ల నేలలో తేమ శాతం ఎక్కువకాలం నిల్వ ఉండటంతో పాటు కలుపు మొక్కల పెరుగుదలను అరికడుతుంది. అలాగే మట్టిలో ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది. ఈ ఆధునిక విధానం ద్వారా 30 నుండి 40 శాతం వరకు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.
చెట్టు చుట్టూ 1.5 మీటర్ల వరకు బేసిన్‌లు తీసి వర్షపు నీరు నిల్వ ఉండేలా చూడాలని సూచించారు.
నీటి ఒత్తిడితో స్ట్రెస్‌లో ఉన్న చెట్లకు ప్రతి 15 రోజులకు ఒకసారి లీటర్ నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం సూచనలు ఉన్నందున రైతులు తప్పనిసరిగా యాంటీ స్ట్రెస్ పిచికారీలు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా రైతులకు బంతి, మిరప, టమోటా, మునగ, బొప్పాయి వంటి నారులను షేడ్‌నెట్ ద్వారా పెంచి అందిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు అవసరమైన రైతులు ఒక నెల ముందుగానే ఇండెంట్ నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ఆత్మకూరు, సిద్ధరాపురం గ్రామాలలోని చీనీ తోటలు, మామిడి తోటలను, గార్లదిన్నె మండలంలోని ఇల్లూరు మరియు పరిసర గ్రామాలను ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ జి. త్రికల మాధవి, డిహెచ్ఓ శ్రీమతి ఉమాదేవి, ఉద్యానవన అధికారులు, వీహెచ్‌ఏలతో కలిసి సందర్శించారు. సమస్య తీవ్రత ఎక్కువ కాకముందే రైతులు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.

Posted Under AP
Editor