అనంతపురంలో ఘనంగా “గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” కార్యక్రమం.

అనంతపురంలో ఘనంగా “గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” కార్యక్రమం

* స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUA) లోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో “గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ మాట్లాడుతూ, జిల్లాలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలకంగా పనిచేయాలని సూచించారు. వ్యవసాయ, హార్టికల్చర్ వ్యర్థాలను ఉపయోగించి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసేందుకు అనంతపురం జిల్లాలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా స్టార్టప్‌లు ప్రదర్శించిన అరటి నారతో తయారైన ఉత్పత్తులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. వ్యర్థాలను సంపదగా మార్చే ఇలాంటి ఆవిష్కరణలు గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు నిదర్శనమని కొనియాడారు.

యువతలో స్టార్టప్‌లపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోందని, ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు సమన్వయంతో పనిచేస్తే అనంతపురంలో బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో JNTUA అధికారులు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రతినిధులు, పలు స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Posted Under AP
Editor