అనంతపురం జిల్లా, జేఎన్టీయూ.
– *రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో స్టార్టప్‌లను ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని జేఎన్టీయూలో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH), అనంతపురము స్పోక్ ఆధ్వర్యంలో జిల్లా పరిశ్రమల కేంద్రం సమన్వయంతో “గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” అనే థీమ్‌తో ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ ఉపాధి అభివృద్ధి మరియు గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోత్సాహం దిశగా స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రీసైక్లింగ్, కంపోస్టింగ్, అప్సైక్లింగ్, డ్రై వేస్ట్ సేకరణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.*
– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇదివరకు ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకురావాలన్నా లేదా సహకారం కావాలన్నా బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద నగరాలపై ఆధారపడాల్సి వచ్చేదన్నారు. అనంతపురం జిల్లాలో జేఎన్టీయూ, ఎస్కేయు వంటి పెద్ద విద్యాసంస్థలు మరియు ఎన్నో కళాశాలలు ఉన్నాయని, అలాగే జిల్లాలో ప్రైమరీ సెక్టార్ అయిన అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్‌లో ఎంతోమంది ఇన్నోవేటర్స్ ఉన్నారని, వీరందరినీ ముందుకు తీసుకెళ్లడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వంటి సంస్థ చాలా అవసరమన్నారు. గత 3-4 నెలలతో పోలిస్తే, కొన్ని స్టార్టప్‌లు ఐడియా స్టేజ్ నుండి ప్రాడక్ట్ స్టేజ్ కి వెళ్లడం చాలా సంతోషకరమన్నారు. బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి లేదా వైజాగ్‌తో పోలిస్తే మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నామని, ఒక పరిపూర్ణమైన స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో టెక్నాలజికల్‌గా మరియు మార్కెటింగ్ పరంగా ఈ స్టార్టప్‌లను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. జిల్లాలో కొత్త ప్రొడక్ట్స్‌ను ఎలా గుర్తించాలనేది ముఖ్యం అని, ప్రస్తుతం జిల్లాలో వృధాగా పడేస్తున్న బయోమాస్ (వ్యవసాయ వ్యర్థాలు) చాలా ఎక్కువగా ఉందని, అరటి, ఉల్లిపాయల వ్యర్థాలు వంటి వాటి నుండి ఎలాంటి ఆదాయం రాకుండా వాటిని పక్కన పెట్టేయాల్సి వస్తోందని, ఇలాంటి వ్యర్థాలను ఉపయోగించుకోవడానికి సర్క్యులర్ ఎకానమీ మోడల్‌లో మనకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందాక తాను అక్కడే ప్రదర్శించిన స్టాల్ లో అరటి నారతో చేసిన పాలు ఉత్పత్తులను చూశానని చాలా బాగున్నాయని పేర్కొన్నారు. మన జిల్లాలో జెఎన్టీయు వంటి పెద్ద విద్యాసంస్థ ఉందని, వారి దగ్గర ల్యాబ్స్ ఉన్నాయని, అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో హార్టికల్చర్ యూనివర్సిటీ, మన జిల్లాలో అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వంటి ప్రభుత్వ సంస్థలు ఉన్నాయని, ఒక సాధారణ వ్యక్తి నేరుగా అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్‌నో లేదా ప్రైవేట్ కంపెనీలను సంప్రదించి ప్రొడక్ట్ డెవలప్ చేయలేడు. కానీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంస్థలన్నింటితో సమన్వయం చేసుకుని, అక్కడి సదుపాయాలను వాడుకునేలా చేస్తే, ఇది ఇక్కడి స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఒక అయస్కాంతంలా మారుతుందన్నారు. మనది అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టి, సాఫ్ట్‌వేర్ లేదా టెక్నాలజీ ప్రొడక్ట్స్‌తో పాటుగా, ఈ ప్రైమరీ సెక్టార్‌లో వాల్యూ అడిషన్ ప్రొడక్ట్స్ తయారు చేసి ముందుకు తీసుకెళ్లడం జిల్లాలోని ఎక్కువ మందికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఆత్మ పిడి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ సంస్థలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో కలిసి పనిచేయాలన్నారు. రైతులతో డిపార్ట్‌మెంట్‌కు ఉన్న మంచి సంబంధాల వల్ల క్షేత్రస్థాయిలో స్టార్టప్‌ల ప్రొడక్ట్స్‌ను టెస్టింగ్ మరియు సర్టిఫికేషన్ చేయడానికి వీలవుతుందన్నారు. గతంలో చదువుకునేటప్పుడు కేవలం ఉద్యోగం సంపాదించాలనే ఆలోచనే ఉండేదనీ, కానీ, ఈ 2026 నాటికి పరిస్థితి మారిందని, ఇప్పుడు టెక్నికల్ లేదా ఇతర యూనివర్సిటీల్లో చదివే పిల్లల్లో కనీసం 20 నుండి 30 శాతం మంది సొంతంగా స్టార్టప్ పెట్టుకోవాలనే మైండ్‌సెట్‌తో ఉన్నారన్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో 16 నుండి 30 సంవత్సరాల వయస్సు గల యువత రిస్క్ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని, ఎందుకంటే వారికి భవిష్యత్తులో మరో 30-35 ఏళ్ల జీవితం ఉంటుంది కాబట్టి, వారు కొత్తగా ఏదైనా సాధించగలరన్నారు. కార్యక్రమంలో భాగంగా హబ్ తరపున మరిన్ని మంచి ప్రయత్నాలు జరగాలని కోరారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కింద జీఎం డిఐసి అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.*
– *అంతకు మునుపు అక్కడే ఏర్పాటు చేసిన పలు ఇన్నోవేటివ్ ప్రొడక్టులను పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ ఆంధ్ర – సంపన్న ఆంధ్ర లక్ష్య సాధనలో యువత, మహిళలు, ఎస్.హెచ్.జిల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో డా.ఆర్ హఫీజ్ భాష పేర్కొన్నారు.*
– *ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి శ్రీమతి శైలజ, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాస్ యాదవ్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాప్ రెడ్డి, కాలుష్య నివారణ బోర్డు ఈఈ శశికళ, కేవిఐబి ఇంచార్జి వరప్రసాద్, ఎల్డిఎం మారుతి శ్రీనివాస్, ఇతర అధికారులు, వివిధ స్టార్టప్ కంపెనీ ప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, మరియు స్టార్టప్ వ్యవస్థాపకులు పాల్గొన్నారు.*
