విద్యార్థుల భవిష్యత్తుతో వైసీపీ రాజకీయాలు చేయడం దారుణం – అంకెలే జగన్ ప్రభుత్వ వైఫల్యానికి సాక్ష్యం : తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు.
ఉరవకొండ:
సాక్షి పత్రికలో ప్రచురితమైన ఫీజు రీయింబర్స్మెంట్ కథనం పై ఉరవకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ కథనం పూర్తిగా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని పేర్కొన్నారు. గత జగన్ ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు.
2024-25 విద్యా సంవత్సరానికి కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.1,198 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఇందులో బీసీ సంక్షేమ శాఖ ద్వారా రూ.258 కోట్లు మరియు రూ.477 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా రూ.365 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా రూ.98 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానం ద్వారా తల్లిదండ్రులపై భారం తగ్గించే దిశగా ఇప్పటికే రూ.1,788 కోట్లు విడుదల చేసి వివిధ కళాశాలలో నిలిచిపోయిన దాదాపు 10 లక్షల మంది విద్యార్థులకు అండగా నిలిచిందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 20 నెలలలోనే మొత్తం రూ.2,986 కోట్ల నిధులు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడిందని తెలిపారు. జగన్ రెడ్డి గద్దె దిగే సమయానికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.2,832 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.989 కోట్లు, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద మరో రూ.450 కోట్లు పెండింగ్లో పెట్టి వెళ్లారని విమర్శించారు.
2019-24 మధ్య విద్యార్థులకు గుర్తుకు రాని ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత మాత్రమే జగన్ రెడ్డికి గుర్తుకు వచ్చిందా అని తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ ప్రశ్నించారు.
గతంలో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్నే “జగనన్న విద్యా దీవెన” పేరుతో కొత్త పథకం అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యాలకు చెల్లించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేదని, కానీ జగన్ ప్రభుత్వం మాత్రం “బటన్ నొక్కుడు” పేరుతో ప్రచార ఆర్భాటం చేసి విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేసిందన్నారు.
సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలలు విద్యార్థులను వేధించాయని, కొన్ని చోట్ల హాల్ టికెట్లు కూడా నిలిపివేసి పరీక్షలు రాయనివ్వలేదని గుర్తుచేశారు. దిగిపోయే ముందు కూడా బటన్ నొక్కి డ్రామా ఆడిందే తప్ప ఒక్క రూపాయి బకాయిలు కూడా పూర్తిగా చెల్లించలేదన్నారు.
2014-19 టీడీపీ పాలనలో ప్రతి సంవత్సరం సుమారు 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించగా, జగన్ పాలనలో కేవలం 9 లక్షల మందికే విడతల వారీగా చెల్లింపులు చేసి దాదాపు 7 లక్షల మంది పేద విద్యార్థులను మోసం చేశారని విమర్శించారు.
“విద్యా దీవెన” అంటూ గొప్పలు చెప్పి తల్లిదండ్రులతో అప్పులు చేయించి, విద్యార్థులను మానసిక క్షోభకు గురి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో 2022లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి పోలీస్ స్టేషన్ ముందు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు.
ఐదేళ్లలో ప్రతి ఏడాది నాలుగు విడతలంటూ చెప్పి ఫీజులకే రూ.4,271 కోట్ల బకాయిలు పెట్టిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడటం విడ్డూరమన్నారు. “ఏ కోర్స్ అయినా… ఎక్కడ చదివినా నేనున్నాను” అంటూ ప్రచారం చేసిన జగన్ ప్రభుత్వం 2020-21 నుంచే పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు చెల్లింపులు నిలిపివేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని విమర్శించారు.
రూ.450 కోట్ల బకాయిల విషయంలో కూడా 75 శాతం మాత్రమే చెల్లిస్తామని కళాశాలలను ఒత్తిడి చేసి, కోర్టులకు వెళ్లబోమని యాజమాన్యాల నుంచి లేఖలు తీసుకున్నారని ఆరోపించారు. చివరికి ఆ 75 శాతం కూడా పూర్తిగా చెల్లించకుండా విద్యార్థులు, కళాశాలలను మోసం చేశారని మండిపడ్డారు.
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంటే, వైసీపీ మాత్రం అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి యేళ్ళ మణి చౌదరి, చిన్న, అనిల్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుమార్ స్వామి, సుధాకర్, రాజశేఖర్ భార్గవ్, హరి, గురు స్వామి తదితరులు పాల్గొన్నారు.
