త్వరలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులు నిషేధం.. ప్లాస్టిక్ రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యం. అనంతపురం. మే 05.రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులు నిషేధం కానున్నాయి.ప్లాస్టిక్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 5 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో అమలు కానుంది. ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, ప్లేట్లు, బాటిళ్ళపై ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం వర్తిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం గత ఏడాది ఆగష్టు 15 నుండే ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రం మారాలని ఆదేశించడం జరిగింది. 2026 అక్టోబర్ 2నుండి రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా అమలు కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ప్రభుత్వం నిషేదించిన ప్లాస్టిక్ వస్తువుల్లో 100మైక్రాన్ల మందం కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ వస్తువులన్నీ నిషేదించబడ్డాయి.నిషేదించబడిన వాటిలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు,పీవీసీ బ్యానర్లు ఉన్నాయి. వీటికి బదులుగా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేసి వాటి వాడకాన్ని ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ కు బదులుగా కాగితం, జూట్, గాజు, స్టైన్లేస్స్ స్టీల్ వస్తువులను వాడాల్సి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించాలి. ప్లాస్టిక్ నిషేదానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలలో ప్లాస్టిక్ క్రయ విక్రయాలపై నిఘా ఉంచాలని, ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే వ్యాపారులపై తరచూ దాడులు నిర్వహించాలని ఆదేశించింది.నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించాలని, అలాగే వాడకం దారులకు కూడా జరిమానాలు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే జిల్లా కేంద్రమైన అనంతపురంలో ప్లాస్టిక్ నిషేధం సక్రమంగా అమలు కావడంలేదు. సంబంధిత అధికారులు నామ మాత్రపు దాడులు నిర్వహిస్తూ హెచ్చరికలు చేసి వదిలేస్తున్నారు. దీనితో వ్యాపారులు నిర్భయంగా ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు.వారిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి..ప్లాస్టిక్ వస్తువులకు అలవాటు పడ్డ వినియోగదారుల్లో మార్పు తీసుకు రావాలి.అవగాహన పెంపొందించాలి.ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ప్లాస్టిక్ నిషేధం సాధ్యం.
జూన్ 5 నుంచి ఏపీలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం: 2026 నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రమే లక్ష్యం
