తాడిమర్రి(yes9tv)కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలే శరణ్యం
తాడిమర్రి, మే 1: కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలే శరణ్యమని సత్యసాయి కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శంకరాంజీనేయులు పేర్కొన్నారు. శనివారం 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడిమర్రి సత్యసాయి నీటి సరఫరా పథకం వద్ద ఏపీ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్యతో కలిసి కార్మిక జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉచితంగా తాగునీరు అందించాల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి తప్పుకొని ప్రజలను డబ్బులు పెట్టి నీరు కొనుక్కునే పరిస్థితికి నెట్టుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సత్యసాయి తాగునీటి పథకానికి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. సమర్థంగా పనిచేస్తున్న ఈ పథకాన్ని జడ్పిలో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికులు తమ హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, మండల సహాయ కార్యదర్శి దాసన్న, గుజ్జల రామకృష్ణ, సత్యసాయి కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెద్ద ఓబులేసు, సహాయ కార్యదర్శి జగన్ మారుతి, కార్మికులు నాగార్జున, భాషా, సతీష్, మహేష్, ఓబిరెడ్డి, అశోక్, నడిపి ఓబులేష్, అయ్యప్ప, తిరుపాల్, లక్ష్మిరెడ్డి, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలే శరణ్యం..
