తాడిమర్రి(yes9tv)
తాడిమర్రి మండలంలోని చిల్లకొండాయపల్లి గ్రామంలో మొలకల పున్నమి సందర్భంగా గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి రైతు నుండి విత్తనాలను సేకరించి వాటిని మొలకలుగా పెంచి, గ్రామదేవతలకు సమర్పించడం విశేషంగా జరిగింది.
మొలకల పూజ అనంతరం గ్రామస్తులు ఆనందోత్సాహాలతో ఒకేచోట కూడి బావి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి, సాంప్రదాయంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామీణ సంస్కృతి ప్రతిబింబిస్తూ కట్టెల కోలాట బృందం ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంక నాగర్జున ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్తుల ఐక్యతను అభినందించారు. ఆయన మాట్లాడుతూ రైతులు సంప్రదాయ పద్ధతులను కాపాడుతూ ఇలాంటి వేడుకలను నిర్వహించడం సంతోషకరమని తెలిపారు.
గ్రామ పెద్దలు, యువత, మహిళలు సహా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. మొలకల పున్నమి వంటి సంప్రదాయ పండుగలు గ్రామీణ సంస్కృతిని, రైతుల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.
మొలకల పున్నమి వేడుకలు ఘనంగా నిర్వహించిన చిల్లకొండాయపల్లి గ్రామస్తులు..
