కునుకుంట్ల గ్రామంలో పీఎండిఎస్ ప్రకృతి వ్యవసాయ సదస్సు: ఒకే పాదులో 20 రకాల పంటలు.. ఎకరానికి రూ. 1 లక్ష ఆదాయం!

తాడిమర్రి(yes9tv)తాడిమరి మండలం – కునుకుంట్ల గ్రామంలో పీఎండిఎస్ ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు
తాడిమరి మండలంలోని కునుకుంట్ల గ్రామంలో ఈరోజు వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, సచివాలయ మరియు రెవెన్యూ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో పీఎండిఎస్ (Pre-Monsoon Dry Sowing) ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సులో గ్రామ రైతులకు తక్కువ వర్షపాతం పరిస్థితుల్లోనూ అధిక ఆదాయం పొందే విధానాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తుగా పొడి నేలలో విత్తనాలు వేసే పీఎండిఎస్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ విధానంలో ఒకే పాదులో 15 నుండి 20 రకాల పంటలను సాగు చేయవచ్చని, తక్కువ వర్షం పడినా విత్తనాలు వెంటనే మొలకెత్తి రైతులకు ప్రతి నెల ఆదాయం అందేలా ఉంటుందని వివరించారు.
ఈ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి పంటలు, పప్పుధాన్యాలు, అలాగే కంది, జొన్న, సజ్జ, ఆముదం వంటి ప్రధాన పంటలను ఒకే స్థలంలో సాగు చేయవచ్చని తెలిపారు. పంట వేసిన 15 నుండి 20 రోజులకే కొంత పంట చేతికొస్తూ, సంవత్సరం పొడవునా నిరంతర రాబడి పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రసాయన ఎరువులు, పురుగుమందులు అవసరం లేకుండా కేవలం జీవామృతం, ఘన జీవామృతం ద్వారా ప్రకృతి వ్యవసాయం చేయవచ్చని, దీని వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చని రైతులకు తెలియజేశారు. ఒక ఎకరంలో సుమారు 2400 పాదులు ఏర్పాటు చేసి ఈ విధానంలో సాగు చేస్తే కనీసం లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు.
అదేవిధంగా రైతులు చియా పంట సాగు చేయాలని సూచించారు. ఈ పంటకు తక్కువ నీరు సరిపోతుందని, ఎటువంటి చీడపీడలు లేకుండా సాగు చేయవచ్చని, ఎకరానికి సుమారు ₹70,000 నుండి ₹80,000 వరకు ఆదాయం పొందవచ్చని వివరించారు. అరటి తోటల్లో అంతర పంటగా, ఇతర పంటలకు కంచ పంటగా కూడా చియా పంటను సాగు చేయవచ్చని సూచించారు.
రైతులు తప్పనిసరిగా * యాప్* ను తమ మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈ యాప్ ద్వారా పంట నమోదు, సాగు విస్తీర్ణం, పథకాల వివరాలు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాల సమాచారం, సబ్సిడీల వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.
చివరగా, రైతు సేవా కేంద్రంలో అవసరమైన ఎరువులు మరియు ఇతర వ్యవసాయ అవసరాలు అందుబాటులో ఉంచుతున్నామని, వ్యవసాయ సిబ్బంది ఎల్లప్పుడూ రైతులకు సాంకేతిక సలహాలు అందించడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు.
కావున గ్రామంలోని ప్రతి రైతు కనీసం ఒక ఎకరంలో అయినా ఈ సంవత్సరం పీఎండిఎస్ ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలని అధికారులు విజ్ఞప్తి చేశారు

Posted Under AP
Editor