అనంతపురం జిల్లా
– ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలోని రెడ్ క్రాస్ కుల్లాయప్ప కార్నియా రిట్రీవల్ సెంటర్ యొక్క ప్రథమ వార్షికోత్సవం ఆదివారం నగరంలోని జిల్లా పరిషత్ లోని డిపిఆర్సి మీటింగ్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, జిల్లా రెడ్ క్రాస్ చైర్ పర్సన్ కాపు భారతి, జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్, డాక్టర్ జగన్ మోహన్, జిల్లా బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ ప్రోగ్రామ్ మేనేజర్ సైదన్న శాస్త్రి, మరియు రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు వివిధ స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, అలాగే నేత్రదాతల కుటుంబ సభ్యులు, మరియు కంటి డాక్టర్లు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
– ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, రెడ్ క్రాస్ యొక్క కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, వారు చేస్తున్న బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, మరియు ఇతర కార్యక్రమాలు ఎంతో అవసరమని, గత వారంలోనే రాష్ట్రవ్యాప్తంగా మూడు రెడ్ క్రాస్ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషకరమని తెలిపారు. ప్రజలందరూ నేత్రదానం, అలాగే అవయవ దానానికి పెద్ద ఎత్తున ముందుకు రావాలని, ఇప్పటికే అవయవదానం అవసరమైన వారి సంఖ్యతో పోల్చుకుంటే, వారికి అందుతున్న సాయం చాలా తక్కువని తాను మంత్రి అయినప్పటి నుంచి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి కొంత మెరుగు సాధించినప్పటికీ, ఇంకా చేయవలసింది చాలా ఉందని దానికి రెడ్ క్రాస్ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని, దానికి తనవంత సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. అలాగే, కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్నియా సెంటర్ కు ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్, డాక్టర్ జగన్ మోహన్, మరియు ఇతరులకు తన అభినందనలు తెలిపారు. అలాగే, నేత్రదానానికి సహకరించిన నేత్రదాతల కుటుంబ సభ్యులకు పేరు పేరున అభినందనలు తెలిపారు. ఇలాగే, అందరూ ముందుకు వస్తే మనం త్వరలోనే కార్నియాతో అంధత్వం బాధపడే వారిని పూర్తిగా కంటి చూపు కలిగించే అవకాశం ఉంటుందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, నేత్రదానం అన్నిటికన్నా పవిత్ర దానం అని మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా మరో జన్మ పొందే అవకాశం ఉందని మట్టితో కలిసిపోయే కంటితో వేరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని ఇది చాలా సులభంగా చేసే ప్రక్రియ అని కన్ను మొత్తం తీయరని కేవలం కంటిపైన ఉన్న పొర మాత్రమే తీయడం ద్వారా అది కార్నియా అందత్వంతో బాధపడేవారికి అందించి, వారి జీవితంలో వెలుగులు నింపవచ్చని తెలిపారు. వివిధ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ, రెడ్ క్రాస్ చేసే సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయని, భవిష్యత్తులో కూడా తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ రెడ్ క్రాస్ కి అందజేస్తామని తెలిపారు. రెడ్ క్రాస్ చైర్ పర్సన్ కాపు భారతి మాట్లాడుతూ రెడ్ క్రాస్ కార్నియా కలెక్షన్ సెంటర్ ప్రారంభించే ముందు చాలా మంది తమను నిరుత్సాహపరిచారని, అయినా సరే ధైర్యంగా ముందడుగు వేసి కార్నియా సెంటర్ స్థాపించి కేవలం ఒక సంవత్సరంలోనే 87 మంది నేత్రదాతలు దాదాపు 172 కార్నియాలు అందించి అతి తక్కువ కాలంలోనే 172 మంది జీవితంలో వెలుగులు నింపే అవకాశం కల్పించారని అతి త్వరలోనే ఈ కార్నియా సెంటర్‌ను పూర్తి స్థాయి ఐ బ్యాంకుగా మార్చి తద్వారా స్థానికంగానే కార్నియా అందత్వంతో బాధపడే వారికి స్థానిక హాస్పిటళ్ల ద్వారా కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స చేయవచ్చని తద్వారా ఇక్కడ వారి అందించే నేత్రదానాన్ని మొదటగా స్థానికంగా ఉపయోగించుకుని ఏదైనా ఎక్కువ ఉంటే వాటికి మళ్లీ ఇతర ప్రాంతాలకు కూడా పంపించే అవకాశం ఉందని ఆ దిశగా రెడ్ క్రాస్ ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. తదుపరి నేత్రదాతల కుటుంబసభ్యులను, నేత్రదానానికి సహకరిస్తున్న వివిధ స్వచంద సంస్థల ప్రతినిధులను, ఆర్ధికంగా సహకరిస్తున్న దాతలను రెడ్ క్రాస్ ఘనంగా సత్కరించారు.
