తాడిమర్రి(yes9tv)నిడిగల్లు గ్రామంలో స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహణ
ఈరోజు స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా “నీటి సమృద్ధి” వాటర్ పాజిటివిటీ అనే అంశంతో నిడిగల్లు గ్రామంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రం ఎస్ డబ్ల్యూ పిసి షెడ్) నిర్వహణను జిల్లా పంచాయతీ అధికారి డి ఎల్ పి ఓ శివకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా చెత్త సేకరణ మరియు నిర్వహణ విధానంపై శుభ్రత మిత్రులతో (క్లాప్ మిత్ర ) మాట్లాడారు.
అనంతరం సచివాలయం వద్ద స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేపట్టారు. ఈరోజు అంశానికి అనుగుణంగా గ్రామంలో జరుగుతున్న *నీటి సరఫరా కాలువ పనులు (ఫీడర్ ఛానల్ వర్క్స్ )*ను పరిశీలించారు. ఈ పనుల అవసరంపై కూలీలు, మేట్లను ప్రశ్నించగా, ఎండాకాలంలో వర్షపు నీటి నిల్వ పనులు చేస్తే రాబోయే వర్షాకాలంలో భూగర్భ జలాలు పెరుగుతాయని, తాగునీరు మరియు సాగునీటి కొరత ఉండదని వివరించారు. వారి అవగాహనను అధికారులు ప్రశంసించారు.
గత సంవత్సరంలో గ్రామంలో అమృత్ సరోవర్, ఫారం కుంటలు (ఫార్మ్ పాండ్స్ ), కాలువల పూడికతీత, చెట్ల చుట్టూ వృత్తాకార కందకాలు, పొలాల చుట్టూ నీటి నిల్వ కందకాలు వంటి పనులు విస్తృతంగా చేపట్టడం వలన గ్రామానికి మేలు జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
తదుపరి ఎంపిడిఓ వెంకట రంగారావు, తహసీల్దార్ భాస్కర్ రెడ్డి గునపంతో మట్టి త్రవ్వగా, మాజీ సర్పంచ్ గోనుగుంట్ల నాగభూషణ గంపలలో మట్టిని నింపి కూలీలకు అందించారు. ఈ సందర్భంగా కూలీలకు ఓఆర్‌ఎస్ ద్రావణ ప్యాకెట్లు ( ఓ ఆర్ ఎస్ పాకెట్స్ ) పంపిణీ చేశారు. అలాగే వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామ ఆరోగ్య కార్యకర్త ( ఎం.ఎల్ హెచ్ పి ) వివరించారు.
ఎంపిడిఓ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న జలధార–జలహారతి కార్యక్రమం కింద వర్షపు నీటి నిల్వ కోసం కొండవాల ప్రాంతాల్లో ట్రెంచులు, రైతు పొలాల్లో ఫారం కుంటలు, పంటకాలువలు, ఫీడర్ ఛానెల్స్, చెక్ డ్యాములు, చెరువుల పూడికతీత వంటి పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొత్త చెక్ డ్యాముల నిర్మాణం, చెరువుల మరమ్మత్తులు, చెరువు కట్టల బలోపేతం వంటి పనులను సాగునీటి శాఖ ద్వారా కూడా చేపట్టవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి హేమావతి, ఫీల్డ్ అసిస్టెంట్ ( ఫీల్డ్ అసిస్టెంట్ ) కవితానరేష్, సచివాలయ సిబ్బంది, కూలీలు, మేట్లు తదితరులు పాల్గొన్నారు.
నిడిగల్లులో ఘనంగా ‘స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర’: నీటి సమృద్ధిపై అధికారుల ప్రత్యేక దృష్టి!
