Latest Posts

తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల పనులు పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్: ఏప్రిల్ నెలాఖరుకు పనులు పూర్తి!

కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా, హోస్పేట్ డ్యాం (తుంగభద్ర).

కొత్త గేట్లను బిగించేందుకు జరుగుతున్న పనులను సైట్‌ నుంచే సీఎం‌కు చంద్రబాబుకు ఫోన్ చేసి వివరించారు మంత్రి.

తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల పనులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు.

తుంగభద్ర డ్యామ్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న గేట్లను మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఈరోజు(మంగళవారం) పరిశీలించారు. తుంగభద్ర డ్యామ్ సైట్ నుంచి సీఎం చంద్రబాబుకు మంత్రి ఫోన్ చేశారు. డ్యాం సైట్ నుంచే కొత్త గేట్లు అమర్చేందుకు జరుగుతున్న పనులను సీఎంకు ఆర్థిక మంత్రి వివరించారు. గేట్ల బిగింపు ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుందని మంత్రి పయ్యావులను సీఎం అడిగారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి తుంగభద్ర గేట్ల బిగింపు పనులు పూర్తి కానున్నట్టు మంత్రి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో కర్ణాటక ప్రభుత్వం కూడా త్వరితగతిన పనులు చేపట్టిందని సీఎంకు పయ్యావుల కేశవ్ వివరించారు. గేట్ల బిగింపు పనులు పూర్తైతే కర్నూలు, అనంతపురం జిల్లాకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సీమ జిల్లాలకు మేలు కలిగేలా తుంగభద్ర గేట్ల బిగింపునకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించినందుకు సీఎంకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధన్యవాదాలు తెలిపారు.
తుంగభద్ర రిజర్వాయర్ చరిత్రలో ఇది అద్భుత ఘట్టమని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. పాత తుప్పుపట్టిన గేట్ల స్థానంలో కొత్త గేట్లను అమర్చడం అనేది కాస్త కష్ట సాధ్యమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో పూర్తి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో విపక్షం విషపక్షంలా మారిందని.. రాయలసీమ పట్ల చిత్తశుద్ధితో టీడీపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాయలసీమకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు 20 నెలల్లో 8 వేల కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు చేశామని కాలవ శ్రీనివాసులు వెల్లడించారు.

తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోతే కళ్లలో నీళ్లు వచ్చాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. డ్యామ్‌ వద్ద నుంచి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తే.. రైతుల ప్రయోజనాలు కాపాడాలని ఆదేశించారని తెలిపారు. గేట్లు మొత్తం తుప్పుపట్టాయని.. చేత్తో ముట్టుకుంటే విరిగిపోతున్నాయని అన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడటం కోసం కొత్త గేట్లను అమర్చేందుకు గో ఆల్ అవుట్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళ్లాలని సూచించారన్నారు. తుంగభద్ర డ్యామ్ గేట్లు ఉన్నంత పొడవు దేశంలో మరో ప్రాజెక్టుకు లేవన్నారు. ఒక్క సీజన్‌లో రైతుల ప్రయోజనాల కోసం ఇప్పటికే 18 కొత్త గేట్లు అమర్చామని చెప్పారు. భేషజాలకు పోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు.. కర్ణాటకకు వచ్చి సీఎం సిద్ధరామయ్యతో కాలువ ఆధునీకరణపై చర్చలు జరిపారన్నారు. రైతుల ప్రయోజనాలు శాశ్వతమని.. అందుకే తుంగభద్ర డ్యామ్ గేట్లతో పాటు చైన్‌లను మార్చుతున్నామని చెప్పారు. ఇప్పటికే 18 గేట్లను అమర్చామని.. మొత్తం 33 గేట్లను అమర్చి కాలువ మీద ఉండే రైతులకు నమ్మకం కలిగిస్తామని అన్నారు. అనంతపురం జిల్లా ప్రజల రుణం తీర్చుకోవడానికి అనునిత్యం పని చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన గో ఆల్ అవుట్ స్ఫూర్తితోనే గేట్లను అమర్చగలిగామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

Editor