Latest Posts

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు యుద్ధం ముప్పు.. పెట్రోల్, గ్యాస్ ధరలపై ప్రభావం.. ప్రధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

పశ్చిమ ఆసియాలో మూడు వారాలుగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ సంక్షోభం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు మూడు వారాలుగా విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సభకు ఈ అంశంపై ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నారని గుర్తు చేశారు.

 

పశ్చిమ ఆసియాలోని ప్రస్తుత పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సామాన్య ప్రజల జీవనంపై విపరీతమైన ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా గొలుసులపై ఈ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతోందని, ఇది ఇంధన ధరల పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ సంక్షోభానికి త్వరితగతిన శాంతియుత పరిష్కారం కనుగొనాలని ప్రపంచ దేశాలన్నీ అన్ని పక్షాలను కోరుతున్నాయని తెలిపారు.

 

పశ్చిమ ఆసియా దేశాల్లో సుమారు ఒక కోటి మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారని, వారి భద్రతే తమ ప్రధమ ప్రాధాన్యత అని ప్రధాని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాంతాల్లో ఉన్న భారతీయులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు సుమారు 3 లక్షల 75 వేల మంది భారతీయులను యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుండి సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు ప్రధాని వెల్లడించారు.

 

యుద్ధం అనేది ప్రజలపై పరోక్షంగా, ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్ ఎప్పుడూ శాంతిని కాంక్షిస్తుందని, దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని అన్ని దేశాలకు విజ్ఞప్తి చేశారు. యుద్ధం వల్ల కలిగే ఆర్థిక భారంతో పాటు మానవ ప్రాణ నష్టాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

ప్రత్యేక విమానాల ద్వారా ఇరాన్ నుండి వెయ్యి మంది భారతీయులను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చామని చెప్పారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

 

లోక్‌సభలో పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ఇంధన భద్రత, ఎరువుల నిల్వలపై దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ.. భారత్ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

హోర్ముజ్ జలసంధిలో నౌకాయానం ప్రస్తుతం కష్టతరంగా మారిన మాట వాస్తవమేనని ప్రధాని అంగీకరించారు. అయినప్పటికీ దేశంలో ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల కోసం భారత్ వద్ద ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్నుల చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

 

కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా.. ప్రస్తుతం 41 దేశాల నుండి భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోందని చెప్పారు.ఇథనాల్ బ్లెండింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా చమురు దిగుమతులపై భారాన్ని తగ్గించామని.. అలాగే రైల్వే విద్యుతీకరణ వేగవంతం చేయడం వల్ల డీజిల్ వినియోగం గణనీయంగా తగ్గిందని వివరించారు. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సరఫరాకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Editor