ప్రత్యూష మృతి కేసు: సుప్రీంకోర్టు తీర్పుపై తల్లి సరోజినీదేవి ఆవేదన – 24 ఏళ్ల పోరాటం!

సుదీర్ఘ కాలంగా సాగుతున్న సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఆమె తల్లి సరోజినీదేవి స్పందించారు. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడాన్ని ఆమె స్వాగతించారు. అయితే, తన కూతురి మరణానికి కారణమైన వారికి పడిన శిక్ష ఏమాత్రం సరిపోదని, తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెను హత్య చేశారని సరోజినీదేవి మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. కేసు ప్రారంభంలోనే సాక్ష్యాధారాలను తారుమారు చేశారని, పోస్టుమార్టం నివేదికలో కూడా అవకతవకలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. నిందితుడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలిసిందని, సరైన సాక్ష్యాలు ఉండి ఉంటే అతనికి ఖచ్చితంగా జీవితఖైదు పడేదని ఆమె అభిప్రాయపడ్డారు.

గత 24 ఏళ్లుగా ఒంటరిగా పోరాడుతూ నరకం అనుభవిస్తున్నానని, కన్నతల్లిగా తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కూడా అధికారులు పక్కన పెట్టారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ధైర్యంగా నిలబడ్డానని, ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన తన కూతురు జీవితాన్ని అన్యాయంగా బలి తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ తీర్పు సిద్ధార్థ రెడ్డికి ఊరట నివ్వకపోయినా, తల్లిగా తనకు మాత్రం అసంతృప్తి మిగిల్చిందని ఆమె స్పష్టం చేశారు.

Editor